వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలను షర్మిల ఖండించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. తన మీద ప్రేమతో, చట్ట విరుద్ధమని తెలిసినా షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. జగన్ బెయిల్ రద్దు కోసమే ఇదంతా తాము చేస్తున్నామనడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్‌గా షర్మిల అభివర్ణించారు."చట్ట విరుద్ధమని తెలిసినా.. చెల్లెలి మీద ప్రేమతో షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధం. ఆయన బెయిల్ రద్దు చేసేందుకు మేం కుట్రపన్నాం అనేది ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్. ఆస్తుల మీద ఉన్న ప్రేమతో రక్త సంబంధాన్ని, అనుబంధాలను మర్చిపోయారు.
అందుకే ఇప్పుడు మీకు సమాధానం చెప్పాల్సి వస్తోంది. నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారు. అది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టుల వరకు తీసుకెళ్లారు. ఆస్తులను లాక్కునేందుకు.. ఈడీ కేసులని, తన బెయిల్ రద్దవుతుందని ఏవేవో కారణాలు చెబుతున్నారు. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదు.ఈడీ కేవలం రూ.32 కోట్ల విలువైన కంపెనీ భూమిని మాత్రమే అటాచ్ చేసింది. కంపెనీ షేర్ల వరకు రాలేదు. ఏ సమయంలోనైనా వాటిని బదిలీ చేసుకోవచ్చు. ఏ కంపెనీ ఆస్తులనైనా ఈడీ అటాచ్ చేసినా, ఆ కంపెనీ షేర్ల బదిలీని మాత్రం ఎప్పుడూ ఆపలేదు. స్టాక్ మార్కెట్లలో ఉన్న చాలా కంపెనీలకు సంబంధించి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. అయినా వాటి ట్రేడింగ్ అవుతోంది. షేర్లు కూడా బదిలీ అవుతున్నాయి. 2016లో ఈడీ అటాచ్ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదని జగన్‌మోహన్ రెడ్డి వాదిస్తున్నారు. అలా చేస్తే బెయిల్ రద్దు అవుతుందని బీద ఏడ్పులు ఏడుస్తున్నారు" అని షర్మిల విమర్శించారు.