మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లి, చెల్లి ఇద్దరిపై ఏదో రోజు జగన్ కేసు పెడతాడని తాను ముందే అనుకున్నానని .. ఇప్పుడు అదే జరిగిందన్నారు. సీఎం కుర్చీ కోసం సొంత బాబాయిని చంపేశారని మండిపడ్డారు. మరో చెల్లి న్యాయం కోసం ఢిల్లీ చుట్టూ తిరిగినా న్యాయం చేయలేకపోయారన్నారు. అన్న జగన్ కోసం గతంలో షర్మిల పాదయాత్ర చేసి.. ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. ‘‘కానీ మేము ఇప్పుడు చెల్లికి తల్లికి మేము రక్షణ కల్పిస్తున్నాం’’ అని స్పష్టం చేశారు. వాళ్ల పార్టీ నేతలే జగన్ను నమ్మే పరిస్థితి లేదని... అందుకే వాసిరెడ్డి పద్మతో సహా అందరూ పార్టీని వీడుతున్నారన్నారు.
వైసీపీ వాళ్లు టీడీపీ పార్టీతో టచ్లో ఉండటం అనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే విజయనగరం జిల్లా గుర్ల బాధితులను పరామర్శిస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఘోరాలు జరిగినా ఏనాడు బాధితులను దగ్గరికి వెళ్లలేదంటూ హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.