ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరో గుడ్‌న్యూస్ చెప్పింది. అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజక్టుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. మొత్తం రూ.2,245 కోట్ల వ్యయంతో 57 కిలోమీటర్ల మేర రాజధాని అమరావతి కొత్త రైల్వే లైన్‌ను నిర్మించనున్నారు. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ నిర్మించనున్నారు.
ఈ లైన్ ద్వారా దక్షిణ భారతదేశాన్ని మధ్య, ఉత్తరాదితో అనుసంధానం చేయడం మరింత సులువు అవుతుంది. అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ద, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి ఈ కొత్త రైల్వే లైన్ సులువైన మార్గంగా నిలుస్తుంది. మరోవైపు మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కూడా అనుసంధానిస్తూ నిర్మాణం చేపట్టనుండడంతో బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఈ లైన్ నిర్మాణం ద్వారా 19 లక్షల పనిదినాల ఉపాధి కల్పన జరుగుతుందని అంచనాగా ఉంది. ఈ లైన్ నిర్మాణంతో పాటు ఏకంగా 25 లక్షల చెట్లు నాటి కాలుష్య నివారణకు కూడా కేంద్రం చర్యలు చేపట్టనుంది.