నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మహానందికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా మహానంది ఆలయానికి భక్తులు వస్తుంటారు. శ్రీశైలం ఆలయానికి వెళ్లిన భక్తులు.. మహానంది ఆలయానికి కూడా వెళ్లటం పరిపాటి. అయితే తాజాగా మహానంది ఆలయానికి భారీ విరాళం అందింది. మహానంది ఆలయానికి ఓ రిటైర్డ్ లెక్చరర్ భారీ విరాళం అందజేశారు. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రాజు, శకుంతల అనే దంపతులు మహానంది ఆలయానికి రూ.2 కోట్లకుపైగా విలువైన ఆస్తులను విరాళంగా అందజేశారు.
మహానంది ఆలయానికి 2.10 ఎకరాల భూమిని, ఐదు సెంట్లల్లో కట్టిన ఇంటిని కూడా రాజు దంపతులు విరాళంగా అందజేశారు. గురువారం దేవస్థానం ఈవో చేతికి ఈ ఆస్తులకు చెందిన పత్రాలను దంపతులు ఇద్దరూ అందజేశారు. మహానంది ఆలయం అభివృద్ధి కోసం రాజు గతంలోనూ విరాళాలు అందించారు. ఈ నేపథ్యంలో రాజు దానగుణాన్ని భక్తులు అభినందిస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారులు కూడా రాజు కుటుంబానికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.. స్వామి దర్శనం చేయించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు మహానంది ఆలయానికి ఇటీవలే నంద్యాలకు చెందిన రావూస్ విద్యాసంస్థల అధినేత కూడా లక్ష విరాళంగా అందించారు. ఆలయ అధికారులు ఆయనను స్వామి వారి శాలువాతో సన్మానించి, ప్రసాదాలు అందజేశారు.
మరోవైపు కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో నృత్యప్రదర్సన నిర్వహించారు. మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు కోలాటాలు, నృత్య ప్రదర్శన నిర్వహించారు. రాఘవేంద్రస్వామి మఠంలోని ప్రవచనా మందిరంలో భక్తులు నృత్యాలు, భజన పాటలు ఆలపించారు. రాఘవేంద్రస్వామి మఠానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామి సేవలో తరిస్తుంటారు.