తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. వీరిలో రోడ్డు మార్గంలో కొందరు.. కాలినడక మార్గాల్లో (అలిపిరి, శ్రీవారి మెట్టు) మరికొందరు కొండపైకి చేరుకుంటారు. అయితే తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. ఇటీవల తిరుమలకు కాలి నడకన వస్తూ కొందరు భక్తులు అస్వస్థతకు గురికావడంతో కొన్ని కీలక సూచనలు చేసింది. ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు మెట్ల మార్గాల్లో రావొద్దని సూచించారు. ఒకవేళ రావాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. అలాగే మెట్ల మార్గాల్లో ఉన్న వైద్య సదుపాయాలకు సంబంధించిన వివరాలను తెలిపింది.
60 ఏళ్లు దాటిన వృద్ధులు, షుగర్, రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావొద్దని టీటీడీ సూచించింది. అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న భక్తులు వాహనాల్లో తిరుమలకు చేరుకోవాలని.. నడక మార్గం మంచిది కాదని తెలిపింది. తిరుమల శ్రీవారు కొలువై ఉన్న కొండ సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటుంది కాబట్టి.. ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని గుర్తు చేసింది టీటీడీ.. అందుకే గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నవాళ్లు కాలినడకన రావడం శ్రేయస్కరం కాదని తెలిపింది. వారు నడిచి రావడం చాలా ఒత్తిడితో కూడుకున్నది అని చెబుతోంది. అందుకే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తిరుమలకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వస్తుంటే.. కచ్చితంగా వారు రోజు వారి మందులు తెచ్చుకోవాలని సూచించింది టీటీడీ. ఒకవేళ మెట్ల మార్గాల్లో వచ్చే భక్తులకు ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురైతే.. అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి దగ్గర వైద్య సహాయం అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. తిరుమలలో అశ్వినీ ఆస్పత్రి, ఇతర ఆస్పత్రుల్లో వారం రోజులు 24 గంటలు వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని గుర్తు చేశారు అధికారులు.
తిరుమలకు వచ్చే భక్తుల్లో.. ఎవరైనా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉండి.. వారికి అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపింది టీటీడీ. తిరుమలకు వచ్చే భక్తులు విషయాన్ని గమనించాలని సూచిస్తోంది.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 28 నుండి 30వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు అక్టోబరు 27వ తేదీన సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 28వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6.30 గంటలకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు అక్టోబరు 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు అక్టోబరు 30వ తేదీ రాత్రి 7 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.