మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తి వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల గురించి గత రెండురోజులుగా చర్చ, వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సుదీర్ఘ లేఖ రాశారు. అందులో అనేక విషయాలను ప్రస్తావించారు. తానంటే నాన్నకు ఎంతో ఇష్టమని.. ఇదే విషయాన్ని వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్ గురించి రాసిన పుస్తకంలోనూ చెప్పారన్నారు.
" అమ్మ వైఎస్ విజయమ్మ గారు, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక పుస్తకం రాశారు. అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. "రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే.. తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని తక్కువ చేసి చూడలేదు. నాన్న బ్రతికి ఉన్నన్ని రోజులు ఒకే మాట అనేవారు. "నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం". వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో, నలుగురు గ్రాండ్ చిల్డ్రన్‌కి సమాన వాటా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్ మోహన్ రెడ్డి గారి సొంతం కాదు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గారు "గార్డియన్ " మాత్రమే. అన్నీ వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టలనేది జగన్ మోహన్ రెడ్డి గారి భాధ్యత. ఇది రాజశేఖర్ రెడ్డి గారి మేండేట్"
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఉద్దేశాన్ని ఆయన బిడ్డలమైన తమతో పాటుగా, విజయమ్మకు, కేవీపీ రామచంద్రరావు, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి సహా సన్నిహితులందరికీ తెలియజేశారని షర్మిల లేఖలో పేర్కొన్నారు. వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడు స్థాపించిన అన్ని వ్యాపారాల్లో ఒక్క సండూరు మినహాయించి మిగతా సరస్వతి, భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా... నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలనేది వైఎస్ఆర్ ఉద్దేశమని షర్మిల రాసుకొచ్చారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదనీ.. వైఎస్ఆర్ మరణం తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదన్నారు, ఈ రోజు వరకు తనకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా తన చేతుల్లో లేదని షర్మిల పేర్కొన్నారు.
"స్వార్జితం అని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్న ఆస్తులు అన్ని కుటుంబ ఆస్తులే. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం. ఈరోజు సాక్షిలో చూపినట్లుగా మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రాన, అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు.. ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్లు కాదు. ఆస్తి పంచడం అంటే .. ఇవిగో ఈ ఆస్తులు నీకు, ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచేయడమంటే. నేను జగన్ మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో వాట అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం. ఇవన్నీ కుటుంబ ఆస్తులు కనుక రాజశేఖర్ రెడ్డి గారు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచాలి అనుకున్నారు. కాబట్టే.. ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నాం."
"నాకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజు లేదు. వీళ్ళు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదు. కేవలం నా బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర్ రెడ్డి గారి అభిమతం గనుక, ఈ రోజు వరకు కూడా అమ్మైనా, నేనైనా తపన పడుతున్నాం. ఇప్పటికీ అమ్మ వెయ్యి సార్లు వీళ్ళను అడిగి ఉంటుంది. వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుంది. అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత.. 10 ఏళ్లు జగన్ గారు ఇబ్బందులు పడితే, అవి నా ఇబ్బందులు అనుకొని..నా శక్తికి మించిన సహాయం చేశాను."
"తోడబుట్టిన వాడికోసం నా బిడ్డలను సైతం పక్కనపెట్టి ఆయన్ను, ఆయన పార్టీని ఏ స్వార్ధం లేకుండా నా భుజాల మీద మోశాను. ఆ 10 ఏళ్లు నా అవసరం ఉంది అనుకున్నారేమో నన్ను బాగానే చూశారు. పెద్ద కూతురు అన్నారు. ఆ 10 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి గారు ఊహించినట్లుగానే.. గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు సమానం అన్నట్లుగానే వ్యవహరించారు. ఆ 10 ఏళ్లలో 200 కోట్లు ఇచ్చామని చెప్తున్నది ఇందులో భాగంగానే. ఆ 10 ఏళ్లు నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ.. కంపెనీల్లోనీ డివిడెండ్ లో సగం వాటా నాకు ఇవ్వడమే ఈ 200 కోట్లు. వాళ్ళు చేసింది ఉపకారం కాదు. ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు. నాకు సమాన వాటా ఉంది కాబట్టి డివిడెండ్‌లో సగం వాటా ఇవ్వడం జరిగింది. అది కూడా అప్పుగా చూపించమన్నారు."
"2019లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సిఎం అయిన వెంటనే జగన్ గారు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చిన్నచూపు చూడటమే కాకుండా సిఎం అయిన నెలరోజులకే విడిపోదాం అని ఇజ్రాయిల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు. ఇందుకు అమ్మా, నేను వద్దు అని చెప్పాం. లేదు ససేమిరా విడిపోవాల్సిందే అని పట్టుబట్టారు. తర్వాత రోజుల్లో ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మన్నారు. విజయవాడకు వచ్చాక, భారతి సిమెంట్స్, సాక్షిలో నాకు ఎక్కువ వాటా కావాలని అడిగారు. నేను 60 తీసుకుంటా, నీకు 40 ఇస్తా అని చెప్పారు. అది అమ్మకు కూడా భావ్యం అనిపించలేదు. సగం కంటే ఎక్కువ కావాలని గట్టిగా అనుకుంటే .. 5 శాతం ఎక్కువ తీసుకో.. లేదా 10 శాతం ఎక్కువ తీసుకో.. కానీ 20 శాతం
"తర్వాత అర్థగంటలో ఈ ఆస్తులు నీకు, ఈ ఆస్తులు నాకు అని తేలిపోయింది. దీని ప్రకారం సాక్షిలో 40 శాతం, భారతి సిమెంట్స్‌లో వాళ్లకు చెందిన 49 శాతంలో 40 శాతం, సరస్వతి పవర్ లో 100 శాతం, యలహంక ప్రాపర్టీలో 100 శాతం, వైఎస్ఆర్ నివాసమున్న ఇల్లు, ఇంకా కొన్ని ఆస్తులు నా భాగానికి రావడం జరిగింది.
"సంగతి మేము ఎక్కడా బయట పెట్టలేదు. బయట పడకుండా ఉండటానికి ప్రయత్నం చేశాం. కానీ కేసు వేసిన నెల రోజులకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక జగన్ మోహన్ రెడ్డి గారు కారణం అని ఎందుకు అనుకోకూడదు? దుర్మార్గంగా తల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్ మోహన్ రెడ్డి గారికి, మమ్మల్ని మోసం చేసిన వాళ్ళుగా చిత్రీకరించడంలోనే ప్రయోజనం ఉంది కదా?"
"నేను జగన్ గారికి ఒక లెటర్ రాస్తే.. అది టీడీపీ హ్యాండిల్లో పోస్ట్ అయితే.. నాకు ఏం సంబంధం? నేనైతే బైబిల్ మీద ప్రమాణం చేయగలను. నా వరకు నేను గాని, నా మనుషులు గాని బయట పెట్టలేదని ప్రమాణం చేయగలం. చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం వైఎస్సార్ బిడ్డకు లేదు. జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరి కొంగు చాటున ఉండి, ఆస్తి, అధికారం కోసం ఇదంతా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు." అంటూ వైఎస్ షర్మిల సుధీర్ఘ లేఖ రాశారు.