ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై.. వైసీపీ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. ఆస్తి వివాదం నేపథ్యంలో వైఎస్ఆర్ అభిమానులకు వాస్తవాలు తెలియాలంటూ శుక్రవారం ఉదయం వైఎస్ షర్మిల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలోని ఆరోపణలకు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని ఈ విషయమై విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల తీరుపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోసం కుట్రలు జరుగుతున్నాయంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. చంద్రబాబుతో కలిసి వైఎస్ షర్మిల పనిచేస్తున్నారని విమర్సించారు. జగన్ ఎస్‌సీఎల్‌టీలో పిటిషన్ వేయకపోతే ఆయన బెయిల్ రద్దు చేయాలని టీడీపీ నేతలు పిటిషన్ వేస్తారన్నారు.
మరోవైపు వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించడం అంటే.. చంద్రబాబుతో కలిసి ప్రయాణించడమా అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. వైఎస్ఆర్ రక్తం, చంద్రబాబుతో కలిసి పనిచేస్తుందని.. కలిసి ప్రయాణం చేస్తుందని ఎవరైనా ఊహిస్తారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డిని రాజకీయంగా అణగదొక్కాలని చూసిన వారితో అంకుల్, పెంకుల్ అంటూ చెట్టా పట్టాలేసుకుని తిరుగుతారా అని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో.. వైఎస్ షర్మిల, చంద్రబాబు ఎప్పుడైనా కలిసి తిరిగారా అంటూ మాజీ మంత్రి పేర్ని్ నాని ప్రశ్నించారు. ఇక వైఎస్ జగన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేశానన్న షర్మిల వ్యాఖ్యలకు కూడా పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. 2012లో జగన్ జైళ్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల.. 230 రోజులు పాదయాత్ర చేశారన్న పేర్ని నాని.. 2014 తర్వాత షర్మిల ఏనాడూ పార్టీ కోసం పనిచేయలేదని చెప్పారు. అయితే షర్మిల పాదయాత్ర విషయమై అప్పట్లోనే తాను అనుమానాలు వ్యక్తం చేసినట్లు చెప్పారు.
" వైఎస్ జగన్ జైళ్లో ఉన్న సమయంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేద్దామనుకున్నారు. అప్పుడు నేను జైలులో ఉన్న జగన్ వద్దకు వెళ్లా. ఇది కరెక్ట్ కాదంటూ వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్పా, రాజకీయ పార్టీల్లో ఇది కరెక్ట్ కాదని.. భవిష్యత్తులో చికాకులు వస్తాయని వైఎస్ జగన్‌కు చెప్పా. వైఎస్ జగన్ మాత్రం అలాంటిదేమీ ఉండదు. మా కుటుంబం వేరు. సమస్యలు రావు అని నమ్మకంగా చెప్పారు. నేను మాత్రం చాలా అనుమానాలు చెప్పా. ఇవాళ జరుగుతున్నవన్నీ ఆరోజే సందేహాలుగా చెప్పా. కానీ జగన్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఒకవేళ వైఎస్ జగన్, షర్మిలను రాజకీయంగా రానీయకూడదంటే ఆ రోజు పాదయాత్ర చేయనివ్వరు కదా" అని పేర్ని నాని అన్నారు.
మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే చాలా ఆస్తులు రాసిచ్చారన్న పేర్ని నాని.. సాక్షి జగతి, భారతి సిమెంట్ కంపెనీలు జగన్ స్థాపించినవని చెప్పారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడే జగన్ ఆ సంస్థలను ఏర్పాటు చేశారని.. వాటిల్లో వైఎస్ షర్మిల, ఆయన భర్త అనిల్ డైరెక్టర్లుగా లేరని వెల్లడించారు. కేసుల్లోనుూ జగన్ మాత్రమే జైలుకు వెళ్లారన్న పేర్ని నాని.. భారతి సిమెంట్ పేరుపై షర్మిల అప్పుడెందుకు అభ్యంతరం చెప్పలేదన్నారు. వైఎస్ జగన్ కేవలం కాపలాదారుడు అయితే షర్మిలకు షేర్లు ఎందుకు లేవని ప్రశ్నించారు. చంద్రబాబుతో కలిసి.. షర్మిల పనిచేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు.