ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి ఏపీలో ఆధ్యాత్మిక యాత్ర మొదలుకానుంది. అక్టోబర్ 26 నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించనున్నట్లు.. ఏపీ పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకారం రేపటి నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ఒకరోజు టూర్ ప్యాకేజీ మొదలుకానుంది. జిల్లాలోని ఆధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలను సందర్శించేలా ఈ ఒకరోజు టూర్ ప్యాకేజీ ప్లాన్ చేశారు. అయితే ఈ వన్ డే టూర్ ప్యాకేజీ.. కేవలం శనివారం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా రేపు (శనివారం) ఉదయం ఆరు గంటలకు రాజమండ్రి సరస్వతి ఘాట్ వద్ద నుంచి బస్సులు ప్రారంభమవుతాయి. ఈ ఒకరోజు టూర్ ప్యాకేజీ కోసం పెద్దవాళ్లకు వేయి రూపాయలు, పిల్లలకు రూ.800 ఛార్జీలుగా నిర్ణయించారు. ఆరు పుణ్యక్షేత్రాల మీదుగా ఈ ఒకరోజు పర్యటన సాగనుంది. ఒకరోజు టూర్‌లో భాగంగా మొదట కోరుకొండలోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సందర్శన ఉంటుంది. స్వామి దర్శనం పూర్తైన తర్వాత అక్కడి నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి తీసుకెళ్తారు. సత్యదేవుని దర్శనం పూర్తైన తర్వాత పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయ సందర్శన కోసం పర్యాటకులను తీసుకెళ్తారు.
పాదగయ క్షేత్ర సందర్శన తర్వాత సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయం వద్దకు బస్సులు వెళ్తాయి. అక్కడ స్వామి దర్శనం తర్వాత మధ్యాహ్నం భోజనం ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం కోనసీమ తిరుపతిగా పేరొందిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడితో ఆలయాల సందర్శన పూర్తవుతుంది. వాడపల్లి నుంచి రాత్రి ఏడు గంటలకల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్దకు బస్సులు చేరుకుంటాయి. అక్కడ గోదావరికి జలహారతి కార్యక్రమం చూసిన తర్వాత రాత్రి 7 గంటల 30 నిమిషాలకు రాజమండ్రిలోని ఏపీటీడీసీ కార్యాలయం వద్దకు బస్సులు చేరుకుంటాయి. అక్కడితో యాత్ర పూర్తవుతుంది.బస్సులో 18 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది.