ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మరో శుభవార్త వినిపించింది. ఇటీవలే రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంంట్ కార్పోరేషన్ లిమిటెడ్( హడ్కో) తాజాగా మరో కీలక విషయంలో తీపికబురు వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి హడ్కో ఆర్థిక సాయం చేయనుంది. సచివాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో హడ్కో ఛైర్మన్ సంజయ్ కుల్ శ్రేష్ఠ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యుత్ రంగం గురించి ఇద్దరూ చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ రంగ ప్రాజెక్టులపైనా భేటీలో ప్రస్తావన జరిగింది. అలాగే ఈ భేటీలో డిస్కంలకు ఆర్థిక సాయం అందించేందుకు హడ్కో ఛైర్మన్ సుముఖత వ్యక్తం చేశారు. ఏపీలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్ స్టేషన్ల నిర్మాణానికి హడ్కో ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది.
మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా నిధులు ఇచ్చేందుకు ఇటీవలే హడ్కో అంగీకారం తెలిపింది. అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏకు రూ.11000 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వ కార్యాచరణను పరిశీలించిన హడ్కో.. రుణం ఇవ్వాలని నిర్ణయించింది. అమరావతికి కేంద్రం ఇస్తానన్న రూ.15000 కోట్లకు జతగా.. హడ్కో రుణం కలిసి రూ.26000కోట్లు కానుంది. దీంతో అమరావతిలో నిర్మాణాలను పరుగులు పెట్టించాలని సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణ పనులలో వేగం పెంచాలని.. టెండర్లను పిలిచి, ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులను కూడా పూర్తి చేశారు.
మరోవైపు రాష్ట్రంలోని టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కూడా హడ్కో రుణం ఇచ్చేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం అయ్యే ఖర్చును రుణంగా ఇచ్చేందుకు హడ్కో అంగీకారం తెలిపింది. ఇప్పటి వరకూ ఎన్ని టిడ్కో ఇళ్లు పూర్తయ్యాయి.. మిగతావి ఏ దశల్లో ఉన్నాయి.. నిర్మాణం పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుందనే దానిపై నివేదిక కూడా తీసుకున్నట్లు తెలిసింది. మొత్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం, అమరావతి నిర్మాణాలకు రుణ సాయం చేసేందుకు ముందుకు వచ్చిన హడ్కో.. ఇప్పుడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి సైతం ఆర్థిక సాయం అందించేందుకు అంగీకరించింది. మరిన్ని సబ్ స్టేషన్లు నిర్మించి.. నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.