ఉచిత ఇసుక విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనరేజ్ ఛార్జీని రద్దు చేసూ నిర్ణయించింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోగా.. తాజా సీనరేజీ రుసుమును మాఫీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఏపీ భూగర్భ గనుల శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం సీనరేజ్ రుసుము మాఫీపై జీవో విడుదల చేశారు. అధికారిక ఉత్తర్వులు వెలువడటంతో ఇకపై ఎటువంటి రుసుం చెల్లించకుండానే ఇసుక రీచ్‌ల నుంచి నిర్మాణ అవసరాల కోసం ఇసుకను తీసుకెళ్లవచ్చు. మొన్నటి వరకూ ఎడ్లబండిపై ఉచితంగా ఇసుకను తీసుకెళ్లే అవకాశం ఉండగా.. ట్రాక్టర్లు, లారీల్లో కూడా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది.
మరోవైపు నిర్మాణ రంగం వల్ల ఉపాధి పెరుగుతోందన్న ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో ఇసుకను ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అందులో భాగంగానే సీనరేజ్ ఫీజు, మెరిట్ అన్ శాండ్, డీఎంఎఫ్ మాఫీకి చర్యలు చేపట్టామని తెలిపింది. తాజా నిర్ణయంతో ఇసుక లభ్యత, రవాణా కూడా పెరుగుతుందని పేర్కొంది. మరోవైపు ఇసుక అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్ నివారణకు గానూ విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇసుక లభించని జిల్లాలలో స్టాక్ యార్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలిపోకుండా ఉండేలా జీపీఎస్ ఏర్పాటు చేయాలని.. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేసింది. అలాగే గనుల శాఖ, పోలీస్, ఎక్సైజ్, నీటిపారుదల శాఖల అధికారుల బృందాలు తనిఖీలు చేయనున్నాయి.
మరోవైపు ఉచిత ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఏపీ ప్రభుత్వం పోర్టల్ తీసుకువచ్చింది. ఈ పోర్టల్ ద్వారా ఇంటి వద్ద నుంచే కాకుండా.. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి కూడా ఉచిత ఇసుక కోసం బుకింగ్ చేసుకునే వీలుంది. ఇసుక రవాణాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ప్రభుత్వం ఈ పోర్టల్‌కు రూపకల్పన చేసింది. స్టాక్ పాయింట్లలో ఇసుక స్టాక్ ఎంత ఉంది...ఎన్ని సరఫరా కేంద్రాలుఉన్నాయి.. అనే వివరాలతో ఈ పోర్టల్ రూపొందించారు. ఇసుక కావాల్సిన వారు సొంతంగానే కాకుండా.. సచివాలయాల ద్వారా కూడా ఈ పోర్టల్ ఉపయోగించి ఇసుక కోసం బుకింగ్ చేసుకోవచ్చు.