ఏపీలో నేటి నుంచి పశుగణన ప్రారంభమైంది. 21వ అఖిల భారత పశుగణనలో భాగంగా అక్టోబరు 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.50 కోట్ల కుటుంబాలకు చెందిన పశువుల వివరాలను నమోదు చేయనున్నారు. అలాగే రైతులకు సంబంధించిన వ్యవసాయ పరికరాల వివరాలనూ సేకరిస్తారు. ఈ మేరకు రైతులు తమ పశుసంపదకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేసి నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, భూమిలేని కుటుంబాలకు పశుసంపద ప్రధాన ఆదాయవనరుగా ఉంది. అందుకే ఈ రంగాన్ని మెరుగుపరచడానికి అవసరమయ్యే నిధులు, పథకాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణకు ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ పశుగణనను నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు భాగస్వామ్యంతో కేంద్రం రూపొందించిన యాప్ ఆధారంగా నిర్వహిస్తారు. ఈ పశుగణను ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, కోళ్లు, పక్షులు సహా 16 రకాల పెంపుడు జంతువుల సమాచారాన్ని సేకరిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 17,244 గ్రామాలు, పట్టణాల్లోని 3,929 వార్డుల్లో గృహ, గృహేతర వ్యక్తుల నుంచి వివరాలు సేకరించనున్నారు. మొత్తం 5,390 మంది సిబ్బంది, 1,237 మంది పర్యవేక్షకులు, 45 మంది స్క్రూటినీ అధికారులు, ఇతర సిబ్బంది ఈ పశుగణనలో పాల్గొంటున్నారు. ఈ సిబ్బందికి ట్రావెలింగ్ కిట్లు, 60వేల వాల్‌పోస్టర్లు, 1.50కోట్ల గృహస్టిక్కర్లు, 8వేల ఐడీ కార్డులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పశుగణన పూర్తయిన ఇంటి తలుపుపై స్టిక్కర్ కూడ అంటించనున్నారు. రైతులు కచ్చితంగా వివరాలు నమోదు చేయించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.
మరోవైపు రాష్ట్రంలో గ్రామాల్లో రోడ్లు, కాలువల నిర్మాణం కోసం అవసరమైన సిమెంట్‌ను ప్రభుత్వం నిర్దేశించిన ధరకు లోబడి మార్కెట్లో కొనుగోలు చేయొచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. పాత విధానం పక్కన పెట్టి మార్కెట్లో సిమెంట్ కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రం కేంద్రం గ్రామ పంచాయతీలకు, జిల్లా, మండల పరిషత్తులకు ఇచ్చిన రూ.590 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఈ నిధులు పంచాయతీరాజ్‌శాఖ త్వరలో వీటిని గ్రామీణ స్థానిక సంస్థల బ్యాంకు అకౌంట్‌లకు జమ చేస్తారు.