కొన్ని రోజులు కిందట ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో ఆందోళనకు కారణమైన తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైన సంగతి తెలిసిందే. తాజాగా కల్తీ నెయ్యి ఆరోపణలపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా తిరుమల, తిరుపతిలో సిట్ సభ్యులు పర్యటించనున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి దర్యాప్తు జరపనున్నారు. ఇక ప్రత్యేక దర్యాప్తు బృందం కోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక ఆఫీసు కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు తిరుమల లడ్డూ వ్యవహారంపై దేశవ్యా్ప్తంగా చర్చ జరగ్గా.. సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం అక్టోబర్ 4వ తేదీ స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో సీబీఐ అధికారులు ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులతో పాటుగా.. ఫుడ్ సేఫ్టీ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక సభ్యుడు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆ మేరకు తిరుపతి లడ్డూ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు సిట్ ఏర్పాటైంది. వీరేష్ ప్రభు, మురళి రాంబా, సర్వశ్రేష్ట్ త్రిపాఠి, గోపీనాథ్ జెట్టి, సత్యకుమార్ పాండాలతో సిట్ ఏర్పాటు చేశారు. ఇక విచారణలో వీరికి సహకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 మంది పోలీసులను కూడా నియమించింది.
మరోవైపు దర్యాప్తులో భాగంగా సిట్‌లోని ఓ బృందం శుక్రవారం తిరుపతికి చేరుకుంది. డీఎస్పీ సీతారామాంజనేయులు, శివ నారాయణస్వామి, క్రిష్ణ మోహన్, వెంకటరామయ్యలతో కూడిన బృందం.. శుక్రవారం తిరుపతికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. తిరుమలలోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లు, వంటశాలలు, టీటీడీ హెల్త్ ల్యాబ్ పరిశీలించడంతో పాటుగా టీటీడీ అధికారులు, సిబ్బందిని కూడా సిట్ సభ్యులు విచారించనున్నట్లు తెలిసింది.
అలాగే నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడు సంస్థతో పాటుగా తిరుమల కొండపై ఉన్న లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలను సిట్ సభ్యులు పరిశీలిస్తారు. లడ్డూ తయారీకి ఉపయోగించే ముడిసరుకును పరిశీలిస్తారు. విచారణ పూర్తైన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌కు సిట్ సభ్యులు పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తారు. దాని ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.