ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేర్పాటువాది యాసిన్ మాలిక్ కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 22, 2024, 10:51 PM

వేర్పాటువాది యాసిన్ మాలిక్ కేసులో విచారణ జరుగుతోన్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఆయనను వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరచాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ముంబయిలో మారణహోమానికి తెగబడిన ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ కేసు విచారణ కూడా న్యాయబద్ధంగానే జరిగిందని గుర్తుచేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎలా క్రాస్‌ ఎగ్జామినేషన్ చేయగలమని నిలదీసింది.


1990లో శ్రీనగర్‌ శివారులో నలుగురు ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది హత్య కేసు, 1989లో జమ్మూ కశ్మీర్ హోమ్ మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయా సయీద్‌ కిడ్నాప్‌ కేసులో యాసిన్‌ మాలిక్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల విచారణకు మాలిక్‌ వ్యక్తిగతంగా హాజరుకావాలని జమ్మూ కోర్టు గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. గతంలోనే దీనిపై విచారణ జరిపి జమ్మూ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. తాజాగా గురువారం ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరిపింది.


విచారణకు సీబీఐ తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. భద్రతా కారణాల రీత్యా మాలిక్‌ను జమ్మూకు తీసుకెళ్లలేమని చెప్పారు. . సాక్ష్యుల భద్రత కూడా ముఖ్యమైనని, గతంలో ఓ సాక్షిని హత్య చేశారని తెలిపారు. న్యాయవాదిని నియమించుకోకుండా మాలిక్‌ ట్రిక్స్‌ ఉపయోగిస్తున్నాడని ఆరోపించారు. అతడు సాధారణ నేరస్థుడు కాదని, ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌తో అతడికి సంబంధాలున్నాయని అన్నారు. గతంలో చాలాసార్లు సయీద్‌ను కలిసేందుకు పాకిస్థాన్‌కు కూడా వెళ్లాడని, ఇలాంటి కేసుల్లో మేం కేవలం పుస్తకాల్లో ఉన్నట్లు చేయలేమని వివరించారు..


సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలపై జస్టిస్ ఏఎస్ ఒకా, జస్టిస్ ఏజీ మస్హిలధర్మాసనం స్పందిస్తూ.. ‘న్యాయస్థానంలో వ్యక్తిగతంగా హాజరుపరచకకపోతే వీడియో కాన్ఫరెన్స్‌లో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ఎలా చేయగలం? జమ్మూలో ఇంటర్నెట్‌ సౌకర్యం అంతంతమాత్రంగానే ఉంటుంది.. మన దేశంలో ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు కూడా పారదర్శక విచారణ ఎదుర్కొనేలా అవకాశాలు కల్పించాం’ అని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.


ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జీవిత ఖైదు పడిన యాసిన్‌ మాలిక్‌ ప్రస్తుతం తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గతేడాది జులైలో సుప్రీంకోర్టులో ఆకస్మికంగా ప్రత్యక్షం కావడం సంచలనం రేపింది. ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే యాసిన్‌ మాలిక్‌ను కోర్టుకు తీసుకురావడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై అప్పట్లో పలువురు తిహార్ జైలు అధికారులను సస్పెండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com