మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా దాదాపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికే పట్టం కట్టాయి. ఇక కాంగ్రెస్-ఉద్ధవ్ ఠాక్రే శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాఢీ కూటమి మాత్రం విజయం తమదేననే ధీమాలో ఉంది. ఈ నేపథ్యంలోనే శనివారం రోజున ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే ఫలితాలు రాకముందే.. ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా.. అసలు ట్విస్ట్ అంతా ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారు అనేది తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
షిండే శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ మాత్రం.. శనివారం వెల్లడించే ఎన్నికల ఫలితాల్లో మళ్లీ మహాయుతి కూటమి విజయం సాధించి.. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అదే పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవనాన్‌కులే మాత్రం.. మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని తెలిపారు.
అయితే అటు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పాత్ర పోషిస్తుందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే చాలా ఎగ్జిట్ పోల్స్.. మహాయుతిదే అధికారం అని తేల్చి చెప్పిన వేళ.. ఓటింగ్ ట్రెండ్స్, ప్రజలు మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా అభ్యర్థులు విజయం సాధిస్తారని.. మహావికాస్ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. నానా పటోలే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్.. ఒకవేళ నానా పటోలే సీఎం కావాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అతడి పేరును ప్రకటించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా మహావికాస్ ఆఘాఢీ కూటమి భాగస్వాములు అంతా కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారని తేల్చి చెప్పారు.
నవంబర్ 23వ తేదీ సాయంత్రంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు మహావికాస్ ఆఘాఢీ కూటమి సిద్ధంగా ఉంటుందని సంజయ్ రౌత్ వెల్లడించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు అవసరం లేకుండా మహావికాస్ ఆఘాఢీ కూటమి 160 సీట్లకు పైగా గెలుచుకుని.. అదే రోజు ముఖ్యమంత్రి ఎవరు అనేది ఖరారు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను సంజయ్ రౌత్ కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ మోసం అని అభివర్ణించారు. అవసరం అయితే ఇండిపెండెంట్ల మద్దతుతోనైనా మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారాన్ని చేపడుతుందని శివసేన పార్టీకి చెందిన మంత్రి దీపక్ కేసార్కర్ తెలిపారు.
ఇక బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే మాత్రం.. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావాలని బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నారని.. అదే సమయంలో ఏక్‌నాథ్ షిండే సీఎం కావాలని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారని తెలిపారు. దీన్ని కేంద్ర నాయకత్వమే నిర్ణయించాలని వెల్లడించారు. ఏక్‌నాథ్ షిండే కారణంగానే, ఆయన పాపులారిటీని చూసి మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమికి పట్టం కడతారని.. అందుకే ఏక్‌నాథ్ షిండే సీఎం కావడం హక్కు అని ఆ పార్టీ నేత సంజయ్ శిర్సత్ పేర్కొన్నారు. అయితే షిండే ఏ నిర్ణయం తీసుకున్నా తాము తప్పకుండా ఆయన వెంట ఉంటామని స్పష్టం చేశారు.