మావోయిస్ట్ కంచుకోట క్రమంగా బీటలు వారుతోంది. దండకారణ్యంలో మరోసారి తుపాకులు గర్జించాయి. శుక్రవారం ఉదయం బస్తర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్ట్‌లు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. సుక్మా జిల్లా భెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకూ 10 మంది మావోయిస్ట్‌లు హతమైనట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలిలో ఇన్సాస్, ఏకే-47, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ సహా భారీగా ఆయుధాలు లభ్యమైనట్టు బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్‌రాజ్ తెలిపారు.
కుంట, కిష్టారమ్ ఏరియా కమిటీకి చెందిన నక్సల్స్ ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో దక్షిణ సుక్మా ప్రాంతంలో సీఆర్పీఎఫ్, డీఆర్‌జీ దళాలు శుక్రవారం తెల్లవారుజామున గాలింపు చేపట్టాయి. మావోయిస్టులు నక్కిన ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టింది. ఈ సమయంలో నక్సల్స్ కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు ఐజీ ప్రకటించారు. మూడు ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.. ఆ ప్రాంతంతో ముమ్మర కూంబింగ్ కొనసాగుతోందని, అదనపు బలగాలను అక్కడకు పంపామమని తెలిపారు. మృతుల్లో మావోయిస్టుల అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 207 మంది మావోయిస్ట్‌లు హతమయ్యారు.