గోవాకు సమీపంలో అరేబియా మహా సముద్రంలో ఓ ప్రమాదం జరిగింది. ఫిషింగ్ బోట్, భారత నౌకా దళానికి చెందిన స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామి ఢీకొనడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గురువారం సాయంత్రం గోవాకు వాయువ్యంగా 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఇండియన్ నేవీ అధికారులు వెల్లడించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఇండియన్ నేవీ అధికారులు రంగంలోకి దిగారు. జలాంతర్గామికి చేపల వేట నౌక ఢీకొనడంతో.. ఆ నౌకలో ఉన్న ఇద్దరు సముద్రంలో గల్లంతైనట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు ఇండియన్ నేవీ అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రమాద సమయంలో ఆ ఫిషింగ్ బోటులో మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆ బోటు.. సబ్‌మెరైన్‌ను ఢీకొన్న వెంటనే అందులో ఉన్న మత్స్యకారులను ఇండియన్ నేవీ అధికారులు సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు మాత్రం గల్లంతయ్యారు. దీంతో వారిద్దరినీ కాపాడేందుకు భారత నౌకాదళ అధికారులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత భారత నావికాదళం వెంటనే పెద్ద ఎత్తున సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ నేవీ 6 నౌకలు, విమానాలను మోహరించింది.
ముంబైకి చెందిన మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ సహకారంతో.. ఇండియన్ నేవీ ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేసింది. గల్లంతైన ఆ ఇద్దరు మత్స్యకారులను బయటికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా గోవా, ముంబై తీర ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీలు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టనున్నట్లు నేవీ అధికారులు తెలిపారు.
ఇక ఈ ఘటనలో జలాంతర్గామికి ఏ మేరకు నష్టం జరిగిందనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. ఈ ప్రమాదానికి గురైంది స్కార్పియన్ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి అని నేవీ అధికారులు తెలిపారు. ఇండియన్ నేవీలో పలు రకాల కీలక మిషన్లను చేపట్టే సామర్థ్యం దీనికి ఉందని పేర్కొన్నారు. యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ కోసం ఈ స్కార్పియన్ శ్రేణికి చెందిన జలాంతర్గామిని తయారు చేశారు. అత్యాధునిక శబ్ధ నియంత్రణ టెక్నాలజీతో దీన్ని తయారు చేయడం విశేషం.