ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీల కంటే ముందుగానే.. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధం అవుతోంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాకముందే ఇప్పటికే 11 మంది అభ్యర్థుల పేర్లను ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఢిల్లీలో పాదయాత్ర కూడా చేశారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ఉచిత హామీలను శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా 7 ఉచిత హామీలను ప్రకటించిన కేజ్రీవాల్.. వాటిని రేవ్‌డీలు అంటూ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ అమలు చేసే పథకాలపై తీవ్ర విమర్శలు గుప్పించిన బీజేపీ.. వాటిని రేవ్‌డీ(ఉచితాలు) అంటూ హేళన చేసింది. ఈ నేపథ్యంలోనే దాన్నే ఆయుధంగా మలుచుకున్న కేజ్రీవాల్.. రేవ్‌డీ పేరుతోనే హామీలు ఇచ్చారు.
ఢిల్లీలో తిరిగి ఆప్ సర్కార్ కొలువుదీరితే.. ఇప్పుడు అమలు చేస్తున్న వాటితోపాటు మరిన్ని పథకాలు అమలు చేస్తామని.. అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏడు ఉచిత హామీలను ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు ఉచితంగా విద్యుత్, నీరు, విద్య, మొహల్లా క్లినిక్‌లలో చికిత్స, మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ఇవే కాకుండా ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు ప్రతీ నెలా రూ.1000 అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు ఎవరైనా వయోవృద్ధులు.. మలి దశలో తీర్థయాత్రలకు వెళ్లాలంటే వారికి ఆర్థిక సాయం కూడా కల్పిస్తామని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు.
అయితే ఢిల్లీలో బీజేపీ ఇచ్చే పథకాలను.. బీజేపీ ఉచితాలు అంటూ విమర్శిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్.. వీటిని రేవ్‌డీలుగా అభివర్ణించారు. రేవ్‌డీలు అంటే.. బెల్లం పాకం, నువ్వులు కలిపి తయారు చేసే ముద్దలు. ఆప్ హామీలను రేవ్‌డీలతో పోల్చి.. బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించగా.. ఇప్పుడు అదే పదంతో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. "రేవ్‌డీ పర్ చర్చా" అనే ప్రచార కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జిల్లా, బూత్ స్థాయి కార్యకర్తలు 65 వేల సమావేశాలు, కరపత్రాల ద్వారా ఢిల్లీలోని ఇంటింటికీ చేరవేస్తాయని కేజ్రీవాల్ వెల్లడించారు.
ఈ సందర్భంగా కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌పై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి రేవ్‌డీలను అమలు చేయడం లేదంటూ మండిపడ్డారు. ఉచిత హామీలు ఇచ్చే ఆలోచన బీజేపీకి లేనేలేదని చెప్పారు. ఢిల్లీపై కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని అధికారాలు ఉన్నాయో.. అంతే బాధ్యతలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. అయితే ఢిల్లీ ప్రజల క్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఈ సందర్భంగా గత 10 ఏళ్లలో ఢిల్లీకి.. బీజేపీ ఏం చేసిందో ఓటర్లను అడగాలని ఆప్ కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో కేంద్రమంత్రులు అమిత్ షా, హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీలోని పూర్వాంచలీ వర్గం వారికి అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ఢిల్లీలో ప్రభుత్వ గుర్తింపు లేని కాలనీలకు రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పిన కేంద్రమంత్రులు.. గత 5 ఏళ్లలో ఏ ఒక్క కాలనీకి కూడా అలా రిజిస్ట్రేషన్ చేయించలేదని కేజ్రీవాల్ మండిపడ్డారు.