నూతనంగా ఏర్పాటైన టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలోని పలు విభాగాల్లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే టీటీడీలో అన్యమతస్తులు 31 మంది పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో 31 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా గుర్తించారు అధికారులు.
టీటీడీలోని ఈ 31మందిలో 2007 వరకు 27 మంది.. అనంతరం నలుగురు ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. మినిస్టీరియల్ విభాగంలో పది మంది.. వైద్యంలో ఏడుగురు.. రవాణా, గార్డెనింగ్‌లలో నలుగురేసి చొప్పున.. ఇంజినీరింగ్‌లో ముగ్గురు.. విద్యాశాఖలో ఇద్దరు.. కళ్యాణకట్టలో ఒకరు ఉన్నట్లు గుర్తించారు. వీరి అధికారిక ధ్రువపత్రాల ప్రకారం హిందూయేతరులుగా తేల్చారు. హిందూ విశ్వాసాలకు దూరంగా ఉంటూ, ఇతర మతాలను అనుసరించేవారూ టీటీడీలో ఇంకా ఎక్కువ మందే ఉన్నారనే ప్రచారం కూడా ఉంది.
అలాగే టీటీడీ ఈవో జే శ్యామలరావు అన్యమతస్థుల అంశంపై స్పందించారు. టీటీడీ పరిధిలో 31 నుంచి 36 మంది అన్యమతస్థులు ఉన్నట్లుగా నివేదికలు అందాయని చెబుతున్నారు. కాకపోతే వారంతా ఆలయ విధుల్లో లేరని.. ఈ అంశంపై ఇప్పటికే న్యాయస్థానంలో రెండు కేసులు నడుస్తున్నాయని చెప్పారు.
ఈ నెల 18న జరిగిన టీటీడీ నూతన పాలకమండలి తొలి సమావేశంలో అన్యమతస్థులు విధులు నిర్వహించరాదని తీర్మానించిన సంగతి తెలిసిందే. వారిని ఇతర శాఖలకు బదిలీ చేస్తారా.. వీఆర్‌ఎస్‌కు అవకాశమిస్తారా అన్నది ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ఉత్తర్వులు కూడా రాలేదు. ఈ విషయమై వెంటనే నిర్ణయాలు తీసుకోలేమని.. కోర్టు ఆదేశాలకు లోబడి ముందుకెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద టీటీడీలో అన్యమస్థుతల అంశంపై ఫోకస్ పెట్టారు.
మరోవైపు టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థుల విషయంలో నూతన పాలకమండలి తీసుకున్న నిర్ణయం సమర్థనీయం అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఎక్కడైనా ప్రార్థన మందిరాల దగ్గ ఆయా మతస్థులు ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఏ మతానికైనా ఇది వర్తిస్తుందని.. తిరుమల పర్యాటక ప్రదేశం కాదని, హిందూ ధర్మం మీద విశ్వాసం లేనివారు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదన్నారు. తిరుమలలో రాజకీయపరమైన ఉపన్యాసాలు, అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా టీటీడీ పాలకమండలి నిర్ణయాన్ని స్వాగతించారు. ఒకవేళ ఎవరైనా రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తే.. అలాంటివారిపై కేసులు పెట్టడంతోపాటు కఠినచర్యలు తీసుకోవాలి అన్నారు. అవసరమైతే అలాంటి నేతలకు ప్రత్యేక దర్శనాలు లేకుండా చూడాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.