బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ప్రాణాలకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు పొంచి ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన కృష్ణజింకను వేటాడటంతో బిష్ణోయ్ వర్గం టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీని లారెన్స్ గ్యాంగ్ హత్య చేసింది. అంతేకాదు, సల్మాన్‌ను చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడింది. దీనిపై ముంబయి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా.. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు రమేశ్ బిష్ణోయ్ సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణజింకను వేటాడిన కేసులో వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు సల్మాన్ ఖాన్.. తమకు డబ్బు ఇవ్వజూపారని ఆరోపించారు. చెక్కు బుక్ ఇచ్చి.. ఎంత కావాలో రాసుకోవచ్చన్నారని, కానీ ఆయన ఆఫర్‌ను తాము తిరస్కరించామని పేర్కొన్నాడు.
వివాదం పరిష్కారం కోసం నష్టపరిహారం ఇవ్వడాన్ని బిష్ణోయ్ వర్గం ఖండించిందని, ఒకవేళ తాము డబ్బులకు ఆశపడితే సల్మాన్ ఆఫర్‌ను అంగీకరించేవాళ్లమని రమేశ్ బిష్ణోయ్ అన్నారు. డబ్బు కోసమే బిష్ణోయ్ గ్యాంగ్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతోందన్న సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ చేసిన వ్యాఖ్యల్ని రమేశ్ కొట్టిపారేశాడు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. కృష్ణజింకను వేటాడిన ఘటన సమయంలో ప్రతి బిష్ణోయ్ రక్తం మరిగిపోయిందని గుర్తు చేసుకున్నాడు.
‘మాలో ఎంత ఆవేశం ఉన్నా.. న్యాయ వ్యవస్థ ద్వారానే వెళ్లాం.. కానీ, మా భావోద్వేగాలను చిన్నచూపు చూసే ప్రయత్నాలను అవమానంగా భావించాం. లారెన్స్ బిష్ణోయ్‌కు మద్దతుగా మా వర్గం ఐక్యంగా ఉంది.. మాకు డబ్బులే కావాలనుకుంటే సల్మాన్ ఖాన్ చెక్ బుక్ ఇచ్చి నచ్చినంత రాసుకోమన్నప్పుడే ఒప్పుకునేవాళ్లం.. ’ అని వ్యాఖ్యానించాడు. ఇక, కృష్ణజింకను వేటాడిన ఘటనలో సల్మాన్ ఖాన్ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్నారు. కేసులో అరెస్టై జైలుకెళ్లిన సల్మాన్ ఖాన్.. బెయిల్‌పై బయటకొచ్చారు. ఈ కేసు విచారణకు హాజరైన సమయంలోనే ఆయనపై కాల్పులకు ప్రయత్నించారు.
ఈ కేసు నేపథ్యంలో ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌ఖాన్‌కు పలుసార్లు బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబయిలోని సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురికాగా.. ఆ హత్య చేసింది తామేనంటూ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ప్రకటించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
సిద్దిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ పేరుతో రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ ఇటీవల ముంబయి పోలీసులకు వాట్సాప్ ద్వారా వచ్చి ఓ సందేశం కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు పంపినట్టు గుర్తించారు. కూరగాయల వ్యాపారం చేసుకునే అతడు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికే ఇలా ప్లాన్ చేశాడని అధికారులు భావిస్తున్నారు.
పోలీసులకు వాట్సాప్‌లో మెసేజ్ పంపిన నిందితుడు.. ‘ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు.. సల్మాన్‌ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో వైరాన్ని ముగించుకోవాలన్నా ఆయన రూ.5 కోట్లు ఇవ్వాలి. ఈ మొత్తం ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతాం’ అని బెదిరించాడు. అయితే, మరో మూడు రోజుల తర్వాత అదే నంబరు నుంచి పోలీసులకు ఇంకో మెసేజ్ వచ్చింది. తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని, ఏదో పొరపాటున జరిగిపోయింది క్షమించాలని కోరడం గమనార్హం.