తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కళ్యాణదుర్గం పట్టణంలోని పారిశుధ్య కార్మికులు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇంటింటా చెత్త సేకరణకు పనిముట్లు ఇవ్వడం లేదని, ఇలా అయితే చెత్త సేకరణ ఏవిధంగా చేపట్టాలంటూ మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. ఇంటింటా చెత్త సేకరణ చేయడానికి కావాల్సిన చెత్త బుట్టలను మున్సిపల్ కమిషనర్, శానిటేషన ఇనస్పెక్టర్ ఇవ్వకపోవడం విడ్డూరమన్నారు.
అలాగే పారిశుధ్య కార్మికులు 62 మంది ఉండగా.. కేవలం 48 మంది మాత్రమే పని చేస్తున్నారన్నారు. మిగతా 14 మంది పనులు చేయడం లేదన్నారు. వెంటనే ఆ 14 మందిని పారిశుధ్య పనులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి వెంటనే ఉద్యోగం కల్పించాలని, రూ.రెండు లక్షలు పరిహారం కూడా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు వెంకటేష్, తిమ్మప్ప, నటరాజు, రమణ, అలివేలమ్మ ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ తదితరులు పాల్గొన్నారు.