పేదలు తినే అన్నంపైనా దుష్ప్రచారం చేయడం సరికాదని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. అనంతపురం స్థానిక పాతూరులోని అన్న క్యాంటీనను టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు లక్ష్మీనారాయణతో కలిసి ఎమ్మెల్యే సోమ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి భోజనం నాణ్యతను పరిశీలించడంతో పాటు పేద ప్రజలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అన్న క్యాంటిన్లు ఏర్పాటైన తర్వాత ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోందన్నారు. భోజనం నాణ్యతపై ప్రతిఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
గత వైసీపీ పాలనలో అన్న క్యాంటీన్లు లేకపోవడంతో బయట హోటళ్లలో అధిక ధరలు వెచ్చించి భోజనం తినలేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే తాము అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించామన్నారు. అన్న క్యాంటీన్లపై కొందరు దుష్ప్ర చారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. భోజనం నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. నగరంలో త్వరలో మరో రెండు అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగారామ్, సుధాకర్ యాదవ్, ఫిరోజ్ అహ్మద్, సుధాకర్‌నాయుడు, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.