మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ జగన్ అని.. అబద్దాలు చెప్పడానికే జగన్ పేటెంట్ తీసుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌ను మంత్రులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జగన్ జాతికి అంకితం చేశారన్నారు. వైసీపీ ఐదేళ్ళ పాలనలో జగన్ మొద్దు నిద్ర పోయారని విమర్శించారు. ఐదేళ్ళలో రూ.170 కోట్లు మాత్రమే జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఖర్చు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్ ఏమైనా చేస్తాడని వెలిగొండ ద్వారా రుజువైందన్నారు. లక్షా 20 వేల క్యూబిక్ మీటర్ల మట్టి టన్నెల్ 1 లో ఉందని.. రెండో టన్నెల్లో బెంచింగ్ పనులు ఉన్నాయన్నారు. 11 కిలో మీటర్లు మాత్రమే లైనింగ్ పనులు చేశారని తెలిపారు.