ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మందుబాబులకు అదిరే శుభవార్త.. ధరలు తగ్గింపు, కొత్త బ్రాండ్లు వస్తున్నాయి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2024, 10:50 PM

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు తీపికబురు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే నాణ్యతతో పాటు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అలాగే మద్యం ధరల తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు.. రేట్ల తగ్గింపుపై కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీపీఎస్ పెట్టి సరకు పంపుతున్నామని.. మద్యం ధరలు తగ్గించి త్వరలోనే వాటిని అమలు చేస్తామన్నారు. అంతేకాదు అనుమతి లేకుండా పబ్‌లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటల్ పేమెంట్ అనుమతిస్తామని.. కొత్త బ్రాండ్ల అమ్మకాలు త్వరలో తీసుకొస్తామని చెప్పారు.


గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్నారు మంత్రి. గత ప్రభుత్వంలో సొంత ఆదాయం కోసం ఆలోచన చేశారని.. తెలంగాణ అమ్మకాలకు, ఏపీలో అమ్మకాలకు రూ.4 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల రూపాయలు తేడా వచ్చిందన్నారు. మరి ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందని..గత ప్రభుత్వం డిస్టిలరీ, తయారీ సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారన్నారు. గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖలోని అక్రమాలపై విచారణ చేస్తున్నామన్నారు. ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశామని.. కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడలేదన్నారు. మూడు వేల షాపులకు, 90 వేల అప్లికేషన్స్ రాగా.. రూ.1800 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందన్నారు కొల్లు రవీంద్ర.


రాష్ట్రంలో మద్యం బెల్ట్‌షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. బెల్ట్ షాపును గుర్తిస్తే వారికి మద్యం సరఫరా చేసిన షాపు లైసెన్స్‌ రద్దు చేస్తామని.. అంతేకాదు మద్యం షాపుల్లో ఎంఆర్‌పీకే విక్రయాలు జరగాలన్నారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీలో ఎక్సైజ్‌ ల్యాబ్‌ను మంత్రి, ఎంపీ భరత్‌ కలిసి సందర్శించారు. ల్యాబ్‌లో పరీక్షలపై అడిగి తెలుసుకుని.. ఏయూ వర్సిటీ ల్యాబ్‌లో 9రకాల పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. మద్యంలో ఎలాంటి ప్రాణాంతక రసాయనాలు లేకుండా చూడటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజలకు అందించే మద్యం గురించి ఎలాంటి అపోహలు లేకుండా చేసేందుకే తమ ప్రభుత్వం ఈ ల్యాబ్‌ ఏర్పాటు చేసిందన్నారు.


గత ప్రభుత్వం గనుల శాఖను సొంత జాగీరులా ఉపయోగించుకుంది అన్నారు మంత్రి రవీంద్ర. క్వారీలు, క్రషర్ల నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేసి మైనింగ్‌ను హైజాక్‌ చేశారని.. ఖనిజ సంపదను నేతల ఆదాయాన్ని పెంచుకోవడానికి వినియోగించుకున్నారు అన్నారు. ఆ అడ్డంకులను, సమస్యలను తొలగించి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా అందరికీ ఆమోదయోగ్యమైన మైనింగ్‌ పాలసీని త్వరలోనే తీసుకురాబోతున్నామని చెప్పారు. గత ప్రభుత్వ బాధితులకు ఉపశమనం కల్పిస్తామని.. మైనింగ్‌తో ముడిపడిన ఈ రంగం అభివృద్ధికి అందరి సలహాలు, సూచనలతో మెరుగైన పాలసీని తీసుకొస్తామన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com