ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వజ్రాల వ్యాపారి ఇంట్లో పెళ్లికి హాజరైన ప్రధాని మోదీ.. ఎవరీ పద్మశ్రీ గ్రహీత సావ్జీ ఢోలాకియా?

national |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2024, 11:02 PM

గుజరాత్ వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియా కుమారుడు ద్రవ్య ఢోలాకియా వివాహానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదిస్తున్న ప్రధాని మోదీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీపావళి పండగ సమయంలో తమ ఉద్యోగులకు భారీగా గిఫ్ట్‌లు ఇచ్చే వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియా కుమారుడు ద్రవ్య ఢోలాకియా వివాహం ఈ వారం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని మోదీ వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. ద్రవ్య ఢోలాకియా, జాన్వి ఒక్కటైన సందర్భంగా ప్రధాని మోదీ ఈ పెళ్లి వేడుకకు హాజరుకావడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నామని సావ్జీ ఢోలాకియా.. వీడియోలను షేర్ చేశారు.


గుజరాత్‌ అమ్రేలి జిల్లా దుధాలా గ్రామంలో 1962 ఏప్రిల్‌ 12వ తేదీన సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సావ్జీ ఢోలాకియా పెద్ద వజ్రాల వ్యాపారిగా ఎదిగారు. అయితే చిన్నతనం నుంచి చదువు సరిగా రాకపోవడంతో 13 ఏళ్ల వయసులోనే 4వ తరగతి వరకు మాత్రమే చదివి.. విద్యకు దూరం అయ్యారు. అప్పుడు తన మేనమామ వద్ద వజ్రాల పాలిషింగ్ వర్క్ నేర్చుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు వజ్రాల వ్యాపారాన్ని సావ్జీ ఢోలాకియా ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే 1992లో మహారాష్ట్ర రాజధాని ముంబైలో శ్రీ హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ పేరుతో వజ్రాల ఎగుమతులను సావ్జీ ఢోలాకియా మొదలుపెట్టారు.


బిజినెస్ ప్రారంభించిన తర్వాత సావ్జీ ఢోలాకియా.. తిరుగులేని విజయాన్ని సాధించారు. వ్యాపారంలో భారీగా లాభాలు రావడంతో తాను సంపాదించిన ఆదాయంలో కొంత దాన ధర్మాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అయినా తన వద్ద పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి తిరిగి ఇవ్వాలని సావ్జీ ఢోలాకియా నిర్ణయించుకున్నారు. అందుకే ప్రతీ సంవత్సరం దీపావళి పండగకు తన వద్ద పనిచేసే సిబ్బంది కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహుమతులు అందిస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే తొలిసారి సావ్జీ ఢోలాకియా పేరు 2011లో వార్తల్లో వచ్చింది. దీపావళి పండగ కింది తన సిబ్బందికి ఖరీదైన బహుమతులతో పాటు బోనస్‌ కూడా అందించారు. ఆ తర్వాత 2015లో తమ సిబ్బందికి 491 కార్లు.. 200లకు పైగా ఫ్లాట్లను గిఫ్ట్‌లుగా ఇచ్చారు. 2018లో ఏకంగా 1500 మంది ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు అందించారు. ఇందులో 600 మందికి కార్లు.. 900 మందికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశారు. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందించడం మరో విశేషం. దీంతో సావ్జీ ఢోలాకియా పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. అంతేకాకుండా పేద యువతులకు వివాహాలు చేయడం.. విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థిక సాయం చేయడం వంటివి కూడా చేస్తుంటారు. ఆయన సేవలకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో అభినందించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com