దేశ రాజధాని నగరంలో దీపావళి పండుగ వేళ దారుణం చోటుచేసుకుంది. కుటుంబమంతా కలిసి సంతోషంగా సంబరాలు చేసుకుంటుండగా.. దుండుగులు బైక్‌పై వచ్చి కాల్పులకు పాల్పడ్డారు. మంచిగా మాట్లాడినట్టు నటిస్తూ.. పెద్దాయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఓ యవకుడు తుపాకీతో కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యాడు. ఢిల్లీలో షహదర ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు గాయపడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాధితుడు ఆకాశ్ శర్మ (44), తన కుమారుడు క్రిష్ వర్మ (10), మేనల్లుడు రిషబ్ శర్మ (16)తో కలిసి గురువారం రాత్రి ఇంటి బయట బాణాసంచా కాలుస్తూ దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో బైక్ వచ్చిన వచ్చిన ఇద్దరు వ్యక్తులు శర్మ ఇంటి ముందు ఆగారు. వారిలో వెనుక కూర్చున్న టీనేజర్ బైక్ దిగి వచ్చి ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. పక్కనే నిలబడిన మరొకడు వెంటనే తుపాకీ తీసుకొని ఆకాశ శర్మపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో అక్కడున్నవారంతా ఏం జరుగుతుందో తెలియక షాకయ్యారు. నమ్మించి మరీ ఈ హత్యకు పాల్పడటం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆకాశ్ శర్మ బయట నుంచి ఇంటి లోపలికి వెళ్తుండగా.. టీనేజర్‌తో వచ్చిన షూటర్ దగ్గరగా వెళ్లి కాల్చి పారిపోతుండటంతో వీడియోలో రికార్డయ్యింది. టపాసుల వెలిగిస్తోన్న రిషబ్.. కాల్పుల శబ్దానికి వెనక్కి తిరిగి చూసేసరికి నిందితులు పారిపోతున్నారు. ఇది వీడియోలో రికార్డయ్యింది.
షాక్ నుంచి తేరుకున్న శర్మ మేనల్లుడు రిషబ్.. బైక్‌పై పారిపోతున్న షూటర్లను వెంబడించాడు. దాంతో అతడిపై కూడా వాళ్లు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో ఆ ఆ పిల్లాడు సైతం ప్రాణం విడిచాడు. ఈ ఘటనలో గాయపడిన శర్మ కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ హత్య ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ద్విచక్రవాహనంపై వచ్చిన టీనేజర్ (16), బాధిత కుటుంబానికి మధ్య డబ్బుల అప్పు విషయమైన వివాదం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. టీనేజర్ డబ్బు అప్పుగా ఇచ్చాడని, అకాశ్ శర్మ దానిని తిరిగి ఇవ్వలేదని వెల్లడించారు. దీనికి సంబంధించి మృతుడిపై ఇదివరకే కేసు నమోదైనట్టు చెప్పారు. ఈ కేసులో టీనేజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ హత్య కోసం అతడు షూటర్‌కు సుపారీ ఇచ్చాడని చెప్పారు. అంతేకాదు, 17 రోజుల ముందు నుంచే ఈ హత్యకు పథకం వేసినట్టు నిందితుడు వెల్లడించాడు.