ప్రధాని ఆర్థిక సలహా మండలి ఛైర్మన్, ప్రముఖ ఆర్ధికవేత్త పద్మ శ్రీ వివేక్ దేవరాయ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 69 ఏళ్లు. వివేక్ దేవరాయ్ పుణేలోని గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్ అండ్ ఎకనమిక్స్ ఛాన్సెలర్‌గానూ, 2019 జూన్ 5 వరకు నీతి ఆయోగ్ సభ్యుడిగానూ ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆయన సేవలకు గుర్తుగా పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. భారత ఆర్ధిక విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అర్ధ శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు, రచనలు చేశారు. పలు పత్రికలకు సంపాదకీయాలు కూడా రాశారు.
స్థూల అర్ధశాస్త్రం, పబ్లిక్ ఫైనాన్స్‌లో నిపుణులైన దేవరాయ్.. ఆర్థిక సంస్కరణలు, పరిపాలన, రైల్వేల గురించి విస్తృత అంశాలను చర్చించారు. వీటితో పాటు మహాభారతం, భగవద్గీతను సంస్కృతి నుంచి తర్జుమా చేశారు. ఇక, 1955 జనవరి 25 మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జన్మించిన వివేక్ దేవరాయ్.. కలకత్తా, ఢిల్లీ యూనివర్సిటీల్లో అర్ధశాస్త్రంలో ఉన్నత విద్యను పూర్తిచేశారు. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో అకడమిక్ కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ 1979 నుంచి 1984 వరకు విధులు నిర్వర్తించి.. తర్వాత పుణే గోఖేల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి 1987 వరకు సేవలు కొనసాగించారు. అనంతరం ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌కు మారారు.
1993లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం, కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో ఆయన న్యాయపరమైన సంస్కరణల కోసం కృషిచేశారు. ఎకనమిక్ అఫైర్స్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రిసెర్చ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్‌టెంపరరీ స్టడీస్‌లోనూ వివిధ పదవులు చేపట్టారు. పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి 2006 వరకు పనిచేసి, తర్వాత కేంద్ర పాలసీ రిసెర్ఛ్ విభాగంలో చేరి 2007 నుంచి 2015 వరకు ఉన్నారు. అనంతర ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటైన నీతి-అయోగ్‌లో సభ్యుడిగా నియమితులయ్యారు. జూన్ 2019లో ప్రధాని ఆర్దిక సలహ మండలిలో నియమితులై ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.
వివేక్ దేవరాయ్ మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘డాక్టర్ వివేక్ దేవరాయ్ జీ ఒక ఉన్నతమైన పండితుడు.. ఆర్థశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత ఒకటేమి విభిన్న రంగాలలో మంచి ప్రావీణ్య ఉంది... తన రచనల ద్వారా భారత మేధో దృశ్యంలో చెరగని ముద్ర వేశారు. ఆర్థిక రంగానికి అతీతంగా మన ప్రాచీన గ్రంథాలపై పరిశోధనలు చేసి ఆనందాన్ని పొందారు.. వాటిని యువతకు అందుబాటులో ఉంచారు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.