అయ్యప్ప దీక్షల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల వచ్చే అయ్యప్పస్వాములకు ఉచితంగా జీవిత బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఇవాళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ కీలక అంశంపై చర్చించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు శబరిమల యాత్ర సందర్భంగా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించనున్నారు. అంతేకాదు, ఆ భక్తుడి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది. అయ్యప్ప ఆలయంతో పాటు కేరళలోని దక్షిణ ప్రాంతంలోని అన్ని ఆలయాలను పర్యవేక్షించే ట్రావెన్ కూర్ దేవస్వోమ్ బోర్డు ఈ సరికొత్త బీమా పథకానికి ప్రీమియం చెల్లిస్తుంది. కాగా, రెండు నెలలకు పైగా కొనసాగే అయ్యప్ప స్వాముల దీక్షల నేపథ్యంలో... శబరిమల ఆలయం నవంబరు 16న తెరుచుకోనుంది.