ఐదు నెలల కూటమి పాలనలో రాష్ట్రం ఆరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో మహిళల మాన ప్రాణాలు గాల్లో దీపాలుగా మారిపోయాయని, ప్రజాస్వామద్య దేశంలో ఉన్నామా.. ఆటవిక రాజ్యంలో జీవిస్తున్నామా ఆనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం చేతగానితనం కారణంగా రాష్ట్రం ఆత్యాచారాలు, హత్యలకు అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. మహిళలమీద అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై నెలరోజుల్లోగా విచారణ చేసి కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల తరపున వైయస్ఆర్‌సీపీ ఆందోళన చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విశాఖలో తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై ధ్వజమెత్తారు. గతంలో ఎన్న్డడూ లేని విధంగా కూటమి పాలనలో 130 రోజుల్లో 130కి పైగా అత్యాచారాలు, దాడులు, హత్యలు, వేధింపులు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, వీటిలో 8 మంది మహిళల హత్యకు గురికాగా, మరో 5 మంది వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నగరిలో మూడున్నరేళ్ల బాలికకు చాక్లెట్స్ ఆశ చూపి మద్యం, గంజాయి మత్తులో దుర్మార్గుడు అఘాయిత్యం చేసి హత్య చేసాడని, అయినా సరే సీఎం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం సమీపంలోనే కడియం మండలం బుర్రి లంకలో మహిళకు నోట్లో గుడ్డలు కుక్కి గ్యాంగ్ రేప్ చేసి చంపేసి కాలువలో పడేసినా నోరు మెదపడం లేదని, తాజాగా తిరుపతి ప్రైవేటు లాడ్జిలో మైనర్ పై అత్యాచారం ఘటన జరిగినా సరైన రక్షణ చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఎన్నో అత్యాచార, వేధింపులు, హత్యలు జరిగినా సరే ఏ సంఘటనలోనైనా సరే బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరామర్శ చేసి ధైర్యం చెప్పారా..? నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారా..? అని ప్రశ్నించారు. శ్రీకృష్ణ దేవరాయుల పాలనలో రత్నాలు, రాశులు రోడ్డుపై పోగులు పోసి అమ్మితే.. బాబు పాలనలో మద్యంను రోడ్ల మీద వరదలా పారిస్తున్నారని ఆక్షేపించారు. తొక్కి పెట్టి నార తీస్తానని డిప్యూటీ సీఎం పవన్ డైలాగులు చెబుతున్నాడని, మరి ఆయన నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు మద్యం తాగి మహిళలపై అత్యాచారాం చేస్తే తొక్కి పెట్టి నార తీసారా..? ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్యే అనుచరులు ఓ మహిళపై చేసిన వేధింపులు ఘటనలో వారిని తొక్కిపెట్టి నారతీసారా..? ముచ్చుమర్రి ఘటనలో ఇప్పటికీ బాలిక మృతదేహాన్ని గుర్తించలేదని, కనీసం నిందితులను పట్టుకుని తొక్కి పెట్టి నార తీయలేదేం.. అని వరుదు కల్యాణీ ధ్వజమెత్తారు. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.