మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిని గతంలో నమ్మి ఒక్క చాన్స్ ఇస్తే ప్రజలను రోడ్డు పాల్జేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఆళ్లగడ్డలో దీపం పథకం 2.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ...ప్రజలు ఎన్డీఏ కూటమిని నమ్మి ఓట్లేశారని.. వారికి మనం పని చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు.
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం ఆబద్ధాలకే పరిమితమైందని భూమా అఖిలప్రియ విమర్శలు చేశారు. విదేశాల నుంచి పరిశ్రమలు తెచ్చి ఏపీని అభివృద్ధి చేయడానికి అటు సీఎం చంద్రబాబు.. ఇటు మంత్రి నారా లోకేష్ ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. ‘‘నా తల్లి శోభా నాగిరెడ్డి పుట్టినరోజు నాడే ఆళ్లగడ్డలో ఓ నూతన పరిశ్రమను మొదలు పెట్టబోతున్నాం. ఈ పరిశ్రమ ద్వారా 2 వేలమది మహిళలకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం’’ అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడించారు.