లైంగిక వేధింపులు, మోసం చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు స్పందించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై సీఐడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విజయవాడ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోతైన విచారణ చేయాలన్నారు. ట్రైబల్ టీచర్‌ను మేరుగ నాగార్జున హత్య చేసినట్లు మహిళ చెప్పిందని.. ట్రైబల్ టీచర్ హత్యపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
లైంగిక వేధింపులతో పాటు మేరుగ నాగార్జున అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. కాగా.. మాజీ మంత్రి నాగార్జునపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో విజయవాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ‘‘మాజీ మంత్రి నాగార్జున ఆయన నిర్వహించే శాఖ పరిధిలో పలు కాంట్రాక్టులు ఇప్పిస్తానని నా వద్ద రూ.90 లక్షలు తీసుకున్నారు. ఎన్నిసార్లు తిరిగినా పనులు ఇప్పించలేదు. కాంట్రాక్టు పనులు ఇప్పించమని అడగడానికి వెళ్లిన నాపై మాజీ మంత్రి నాగార్జున నాలుగుసార్లు అత్యాచారం చేశాడు’’ అంటూ బాధితారులు వాపోయింది. ‘‘మంత్రి పీఏ మురళీమోహన్‌రెడ్డి... సార్ మీతో మాట్లాడాలి రమ్మంటున్నారు అంటూ తాడేపల్లి మండల పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో ఓ అపార్టుమెంటుకు తీసుకెళ్లాడు. బయట తాళాలు వేసి వెళ్లిపోయేవాడు. గత ప్రభుత్వ హయాంలో అధికార బలాన్ని చూసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆర్థికంగా బాధలు, ఇబ్బందులతో ఒత్తిడి తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశా’’ అని బాధితురాలు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై కేసు నమోదు చేసినట్టు తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు తెలిపారు. కాగా.. మహిళ ఫిర్యాదుపై నాగార్జున స్పందించారు. ఆ మహిళ ఎవరో తనకు తెలియదని అన్నారు. ఆమె చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇంతవరకు ఆమె ముఖం కూడా చూడలేదని.. ఆమెపై గుంటూరు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేయనున్నట్లు మేరుగ నాగార్జున పేర్కొన్నారు.