మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేసుల వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసు 11 ఏళ్లుగా తేలలేదు కాబట్టే.. షర్మిల జగన్ మధ్య ఇప్పుడు ఆస్తుల పంచాయితీ వచ్చిందని నారాయణ ఆరోపించారు. ఢిల్లీ వేదికగా నారాయణ మీడియాతో మాట్లాడారు. జగన్ అక్రమస్తుల కేసును మోదీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని నారాయణ అన్నారు. అప్పుడు అన్నా చెల్లెళ్ల పంచాయితీ కూడా తేలిపోతుందని చెప్పారు. 11 ఏళ్ల నుంచి జగన్ బెయిల్‌పై ఉన్నారని గుర్తుచేశారు.
ఆయన కోర్టుకు కూడా వెళ్లడం లేదని విమర్శించారు. మాయల పకీర్ ప్రాణం పక్షిలో ఉన్నట్లుగా జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలను లెఫ్ట్ నెంట్ గవర్నర్ల ద్వారా ఇబ్బందులు పెడుతున్నారని నారాయణ ధ్వజమెత్తారు. సమాఖ్య వ్యవస్థను దెబ్బ తీసేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక దేశం - ఒకే ఎన్నిక అనేది దేశానికి మంచిది కాదని అన్నారు. అధికారం కోసం దేశం వినాశనమైనా ఫరవాలేదు అనేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు బలపడేకొద్దీ జాతీయ పార్టీలు నష్టపోతున్నాయని అన్నారు. సీపీఐ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదురీదుతుందని చెప్పారు. తమ పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడటానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని నారాయణ తెలిపారు. జార్ఖండ్‌లో సీపీఐ పార్టీ 9 సీట్లలో సొంతగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. మహారాష్ట్రాలో ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఒక స్థానంలో పోటీ చేస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్ రాష్ట్రాలను విమర్శించడం సిగ్గుచేటు అని అన్నారు. అధికారం కోసం సౌత్, నార్త్ అని బీజేపీ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని సక్రమంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. మూసీ నది ప్రక్షాళనను వ్యతిరేకిస్తే హైదరాబాద్‌కు ద్రోహం చేయడమేనని అన్నారు. మూసీ ప్రక్షాళన విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు పోటా పోటీగా పోరాటం చేస్తున్నాయని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.