రాష్ట్ర మైన్స్ , ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో లక్ష రూపాయలు రుసుం చెల్లించి మంత్రి కొల్లు రవీంద్ర - నీలిమ దంపతులు సభ్యత్వం తీసుకున్నారు. కొల్లు రవీంద్రతోపాటు ఆయన తనయుడు కొల్లు పునీత్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు హసీమ్ బేగ్ తదితరులు టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. 1989 నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చానని వివరించారు.
టీడీపీలో చాలా పదవుల ద్వారా ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకు, తన కుటుంబానికి వచ్చిందని అన్నారు. ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా సభ్యత్వాలు, సంస్థాగత నిర్మాణం కలిగిన పార్టీ తెలుగుదేశం అని ఉద్ఘాటించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమం కోసం పోరాడే ఏకైక రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనేనని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.