టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా ముఖ్యమంత్రి అని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. శ్రీకాకుళంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన చాలా నిరాడంబరంగా జరిగిందని ఆయన తెలిపారు. అదే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారని ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు శుక్రవారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం శ్రీకాకుళంలో స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన దిగ్విజయం అయిందన్నారు.
సీఎం పర్యటన సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీకి ప్రజలు అఖండ విజయాన్ని అందించారని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి.. జిల్లా స్థాయి సమీక్షలు నిర్వహించటం గత చరిత్రలో ఎప్పుడు, ఎక్కడా లేదన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లాలోని ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లామని ఆయన వివరించారు. ఈ సందర్బంగా జిల్లా సమస్యలపై సీఎం చంద్రబాబు చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ జిల్లాలో గత ఐదేళ్లలో నీటి పారుదల వ్యవస్థను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందంటూ కేంద్రమంత్రి మండిపడ్డారు. జిల్లాలోని వంశధార పేజ్-2 ద్వారా 90 టీఎంసీ నీటిని అందుబాటులోకి తేవటానికి చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని నదులను అనుసంధానం చేయటానికి గతంలోనే ఓ ప్రయత్నం చేశామన్నారు. అయితే నదులు అనుసంధాన ప్రాజెక్ట్‌లో భాగంగా అసంపూర్తిగా ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో ఆదేశించారని ఆయన తెలిపారు.