మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచార ఘటనలను వైసీపీ నేతలు రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆ పార్టీ నేతలు రాజకీయ రాబందుల్లా మారిపోయారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కామాంధులు రెచ్చిపోయిన ప్రతి చోటకు చేరి వారిపై అఘాయిత్యాలను తమకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తున్నారని హోంమంత్రి ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో పోలీసు, సీసీ కెమెరాల వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని అనిత మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చి అధికార పార్టీపై అవాకులు, చవాకులు పేలిన వైసీపీ నేతలు షర్మిల వద్దకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
మహిళలకు అండగా ఉంటామని చెప్తున్న ఆ నాయకులంతా అన్న (జగన్) చేతిలో మోసపోయిన షర్మిలకు అండగా ఎందుకు నిలబడలేదని అనిత మండిపడ్డారు. వడమాలపేటలో చిన్నారిపై హత్యాచారం చాలా బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ (ఆదివారం) బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ కేసులో నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని అనిత అన్నారు. మూడు నెలల్లో శిక్ష పడేలా ప్రత్యేక కోర్టుకి కేసుని తీసుకెళ్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. నిందితుడికి వ్యతిరేకంగా పటిష్టమైన సాక్షాదారాలను ఇన్ టైంలో పోలీసులు నివేదిస్తారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.10లక్షల చెక్కును వారికి అందజేశారు. చిన్నారి తల్లి కోరిన మేరకు ఇల్లు, బాలిక తండ్రికి ఉద్యోగం కల్పిస్తున్నామని చెప్పారు. ఏపీలో గంజాయి సాగు అరికట్టేందుకు డ్రోనులు వినియోగిస్తున్నట్లు అనిత వెల్లడించారు. గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు త్వరలో ప్రత్యేక కిట్లు అందుబాటులోకి రానున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. అభంశుభం తెలియని చిన్న పిల్లను చాక్లెట్ పేరుతో తీసుకెళ్లి హత్యాచారం చేయడం తల దించుకునే చర్య అని ధ్వజమెత్తారు.