ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావటంతో ఏపీ రాజకీయం ఇకపై ఏకపక్షంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. టీడీపీ కూటమికి ఏకంగా 164 సీట్లు రావటం.. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావటంతో వైసీపీ పనైపోయిందని.. ఇక మొత్తం ఏకపక్షమే అనే భావన రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తమైంది. అయితే ఏపీలో టీడీపీ కూటమి సర్కారు ఏర్పాటై ఐదు నెలలు గడిచేసరికి.. పరిస్థితుల్లో కాస్త మార్పు వస్తోంది. కీలక నేతలు వారి దారి వారు చూసుకుంటున్నప్పటికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం తనదైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వెళ్లేవాళ్లు వెళ్లనీ అనే ఉద్దేశంతో ఉన్న వైఎస్ జగన్.. పార్టీని నమ్ముకుని అండగా నిలబడే కార్యకర్తలు, నేతల్లో మాత్రం ధైర్యం, ధీమా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీని ఎదుర్కొనడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది వైసీపీ.
తాజాగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు. వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన దేవినేని అవినాష్ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు. వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెడుతున్న అక్రమ కేసులను ఎదుర్కొని వారికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించినట్లు దేవినేని అవినాష్ చెప్పారు. మరోవైపు ఇటీవల జరిగిన వైసీపీ నేతల టెలీకాన్ఫరెన్స్‌లోనూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే విషయాన్ని నేతలు అందరికీ తెలియజేశారు. గతకొన్ని రోజులుగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. దీనిని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారు.
కూటమి ప్రభుత్వం చేసే అబద్ధపు ప్రచారాన్ని, వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే రాజకీయ కుట్రతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్న సజ్జల.. సోషల్ మీడియా వాయిస్‌ను కాపాడుకోవాలని నేతలకు సూచించారు. ప్రజల కోసం వాస్తవాలు వెల్లడించే సోషల్ మీడియా కార్యకర్తలను మనం కాపాడుకుంటే వారే మన గొంతుకగా నిలుస్తారన్నారని చెప్పుకొచ్చారు. మనకు మద్దతిచ్చే వారికి మన సహాయం అవసరమైనప్పుడు వెంటనే స్పందించాలని జగన్ చెప్పారన్న సజ్జల.. వారికి మనం ఉన్నామనే ధైర్యం, భరోసా ఇవ్వాలని.. దీనికి ప్రాధాన్యం ఇవ్వాలని నేతలకు సూచించారు. అన్ని జిల్లాల్లోనూ కార్యకర్తలకు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు లీగల్‌గా సహాయం చేయాలని.. ఇందుకోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సజ్జల సూచించారు.
మరోవైపు జిల్లాలతో పాటుగా రాష్ట్ర స్థాయిలోనూ కేంద్ర కార్యాలయంలోనూ వైసీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించింది. ఇందులో సీనియర్ అడ్వకేట్‌లు 24 గంటలు అందుబాటులో ఉంచింది. వైసీపీ కార్యకర్తలకు ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించింది.
![]() |
![]() |