ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా పోస్టులు, ట్వీట్‌ల వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలపై పోస్టులు, ట్వీట్‌లు చేసినవారిపై కేసులు నమోదవుతున్నాయి.. అరెస్ట్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ట్వీట్ విషయంలో ఈకేసు నమోదైంది.
ఎక్స్ (ట్విట్టర్)లో మంత్రి నారా లోకేష్‌పై ఎమ్మెల్యే చంద్రశేఖర్ చేసిన ట్వీట్‌లపై యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత కిషోర్ ఫిర్యాదు చేశారు. 'సర్కారు వారి పేకాటా… రాష్ట్రంలోని పేకాట క్లబ్ ల నుండి వారం వారం కమిషన్ వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కుమారుడు మంత్రి నారా లోకేష్.. విద్యాశాఖ మంత్రిగా ఉంటూ పేకాట ఆడేలా మౌలిక, సాంఘిక వసతులు ఏర్పాటు చేయడం ధర్మమా లోకేష్ అంటూ' అంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై గతంలోనే పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యేకు పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అంతేకాదు యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పోలీస్ స్టేషన్లలో పోలీసులు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై పలు కేసులు నమోదు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై సైతం కేసులు నమోదు చేశారని ఎమ్మెల్యే చంద్ర శేఖర్ చెబుతున్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, నేతలపై కేసులు నమోదవుతుంటే.. ఏకంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై కేసు వ్యవహారం చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అభ్యంతరకరంగా, ఎవరినైనా రెచ్చగొట్టేలా, హెచ్చరించేలా, మరొక్ని ఇబ్బంది పెట్టేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవంటున్నారు. లైక్‌లు, షేర్‌లు చేసినా.. గ్రూప్ అడ్మిన్‌లకు కూడా కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా విషయంలో అప్రమత్తం అవసరం అంటున్నారు పోలీసులు.