ఏపీ టూరిజంను కొత్త పుంతలు తొక్కించడంలో భాగంగా, నేడు సీ ప్లేన్ డెమో లాంచ్ చేశారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ లో ప్రయాణించారు. చంద్రబాబు శ్రీశైలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశైలం పర్యటన ముగిసిన అనంతరం చంద్రబాబు... తిరిగి అదే సీ ప్లేన్ లో ప్రయాణించి విజయవాడ చేరుకున్నారు. సీ ప్లేన్ ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నదిపై ల్యాండైంది. కాగా, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ టూరిజం పాలసీని ప్రకటిస్తామని వెల్లడించారు. సీ ప్లేన్ సర్వీసులకు భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. ల్యాండింగ్, టేకాఫ్ కూడా నేలపై కంటే నీటిలోనే బాగుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకానికి అనువైన ప్రదేశాలు ఎన్నో ఉన్నప్పటికీ మార్కెటింగ్ చేసుకోవడంలో మనం విఫలమయ్యామని తెలిపారు. అందమైన ప్రకృతి ఉండే ప్రదేశాల కోసం చాలామంది ఫారెన్ వెళుతున్నారని, ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తే ఆదాయం పెరుగుతుందని అన్నారు. కాగా, విజయవాడలో సీఎం చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి జనార్ధన్ రెడ్డి, పౌరవిమానయాన శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.