కుకీ, మెయితీ తెగల మధ్య చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో మణిపూర్ రాష్ట్రం గత ఏడాదిన్నర కాలంగా అట్టుడికిపోతోంది. కేంద్ర, రాష్ట్ర బలగాలను మోహరించినా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. దీంతో ఆ రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఓ చోట కాల్పులు, హింస చెలరేగుతూనే ఉంది. తాజాగా భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు జరిగిన కాల్పుల్లో 11 మంది మిలిటెంట్లు మృత్యువాత పడ్డారు. ఈ మిలిటెంట్లు కుకీ వర్గానికి చెందిన సాయుధులు అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కాల్పుల ఘటనలో కొందరు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లా బోరోబెక్రాలో సోమవారం ఈ హింస చోటు చేసుకుంది. బోరోబెక్రా పోలీస్ స్టేషన్‌పై సోమవారం మధ్యాహ్న సమయంలో.. కొందరు తుపాకులు కలిగి ఉన్న మిలిటెంట్లు ఒక్కసారిగా దాడులకు దిగారు. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్‌కు దగ్గర్లో ఉన్న జకురాడోర్ కరోంగ్ గ్రామంలోకి చొరబడ్డారు. అక్కడ ఆ మిలిటెంట్లు విధ్వంసం సృష్టించారు. దీంతో మిలిటెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు.. భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దీంతో ఆ మిలిటెంట్లు, సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11 మంది సాయుధులు చనిపోయారు. అయితే చనిపోయిన వారంతా కుకీ తిరుగుబాటుదారులుగా స్థానిక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే సమయంలో ఈ కాల్పుల్లో కొంతమంది సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
అయితే ఇటీవలె బిష్ణుపుర్ జిల్లాలో మిలిటెంట్లు జరిపిన దాడిలో ఓ మహిళ మృతి చెందడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయింది. ఇంఫాల్ లోయలోని సైటాన్ ప్రాంతంలో నవంబర్ 9వ తేదీన ఈ ఘటన జరిగింది. పొలంలో పని చేసుకుంటున్న రైతులే లక్ష్యంగా.. మిలిటెంట్లు కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే ఓ మహిళ చనిపోవడంతో.. గత కొన్ని రోజులుగా మణిపూర్‌లో ఉద్రిక్తతలు తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా మళ్లీ పాత పరిస్థితి నెలకొంది.
మన దేశంలో కొండ ప్రాంతాల్లో నివసించే తెగల్లో కుకీ తెగ కూడా ఒకటి. ఇక ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, మేఘాలయ, అస్సాం, త్రిపుర, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో ఈ కుకీ తెగకు చెందినవారు నివసిస్తారు. ఇక ఈ కుకీ తెగ ప్రజలు ప్రధానంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తుంటారు. మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ ఈ కుకీ తెగ వారికి బలమైన కోటగా ఉంది. అయితే మణిపూర్ రాష్ట్ర జనాభాలో ఈ కుకీ తెగ వారు 40శాతం ఉండగా.. వీరిలో మళ్లీ 20 ఉప తెగలు కూడా ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం కుకీ తెగకు చెందినవాళ్లు క్రైస్తవ మతంలోకి మారారు. అయితే వీరు కొండ ప్రాంతాల్లో ఉండొచ్చు.. కానీ ఆ స్థలాలు మాత్రం అమ్మడానికి వీల్లేదు. గతేడాది మే నెలలో మణిపూర్‌లో అల్లర్లు ప్రారంభం అయ్యాయి. ఇంఫాల్‌లో నివసించే మైతీలు, కొండల్లో జీవించే కుకీల మధ్య చెలరేగిన హింసలో చెలరేగి 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు.