కేరళలోని వయనాడ్ ఉపఎన్నికలు ప్రస్తుతం దేశం మొత్తాన్ని ఆసక్తిగా తిలకించేలా చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన ఈ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి.. ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తున్నారు. అయితే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీని గెలిపించాలని.. అటు కాంగ్రెస్ పార్టీతోపాటు రాహుల్ గాంధీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంకకు మద్దతుగా వయనాడ్‌లో రాహుల్ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రచారంలో భాగంగా ప్రియాంకకు రాహుల్ ఒక సవాల్ విసిరారు.
వయనాడ్‌ను దేశంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలని ఆమెకు ఛాలెంజ్ చేశారు. రాజకీయాలు పక్కన పెడితే.. వయనాడ్‌కు తనకు అనుబంధం ఉందని తెలిపారు. తన హృదయంలో వయనాడ్ ప్రజలకు ఒక గొప్ప స్థానం ఉందని పేర్కొన్నారు. వయనాడ్ నియోజకవర్గంలో ఉన్న ప్రతీ ఒక్కరికి సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వయనాడ్ ప్రాంతంలో ఉన్న అందాలను దేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి చూపించాలని తెలిపారు. వయనాడ్‌ను గొప్ప టూరిస్ట్ స్పాట్‌గా మార్చడానికి ప్రియాంక గాంధీ కృషి చేయాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఎవరైనా టూరిస్ట్‌లు కేరళకు వస్తే మొట్టమొదట వారికి వయనాడ్ ప్రాంతమే గుర్తుకు రావాలని రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీకి సూచించారు. కాబోయే ఎంపీ ఇది ఛాలెంజ్‌గా తీసుకోవాలని ప్రియాంకను ఉద్దేశించి ఈ సవాల్ చేశారు. ఈ వయనాడ్ ప్రాంతానికి మంచి జరిగితే.. అది తనకెంతో సంతోషానిస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఇక వయనాడ్ ఉపఎన్నికకు నవంబరు 13వ తేదీన పోలింగ్ జరగనుండగా.. నేటితో ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 23వ తేదీన జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల లెక్కింపుతో పాటే వయనాడ్ బైపోల్స్ ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెలువరించనున్నారు.