తెలుగువారిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసి పరారీలో ఉన్న నటి కస్తూరి.. తాజాగా కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలుగు ప్రజలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కస్తూరిపై పలువురు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో ఆమెకు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు.. కస్తూరి ఇంటికి వెళ్లగా ఆమె తన ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ రావడంతో కస్తూరి పరారీలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను వెతికేందుకు చెన్నై పోలీసులు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.
అయితే తాను తెలుగు ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినట్లు కస్తూరి తెలిపారు. అయినప్పటికీ తనపై పిటిషన్లు, బెదిరింపులు వస్తున్నట్లు కోర్టుకు వివరించారు. ఇటీవల బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెన్నైలో హిందూ మక్కల్ కట్చి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి మాట్లాడారు. ఈ క్రమంలోనే తెలుగువారిపై ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై పలు తెలుగు సంఘాలు, ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో చెన్నైలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కస్తూరిపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఈ కేసులో సమన్లు జారీ చేయడానికి చెన్నై పోలీసులు.. శనివారం పోయెస్ గార్డెన్‌లోని కస్తూరి ఇంటికి వెళ్లారు. అయితే ఆమె ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. కస్తూరికి ఫోన్ చేశారు. అయితే ఆమె ఫోన్ నంబర్ స్విచాఫ్ రావడంతో కస్తూరి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ఆమె ఆచూకీని కనిపెట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి జల్లెడ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె.. ఈ కేసుల్లో రక్షణ కోసం ముందస్తుగానే మధురై కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.
ఆంధ్ర నుంచి 300 ఏళ్ల క్రితం.. ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే.. వందల ఏళ్ల కంటే ముందు నుంచే ఇక్కడికు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు అంటూ హిందూ మక్కల్ కట్చి నిర్వహించిన కార్యక్రమంలో కస్తూరి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలుగు మాట్లాడే వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కస్తూరి మండిపడ్డారు. పారిశుద్ధ్య పనులు చేసే వాళ్లు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారని హేళన చేసి మాట్లాడటం తీవ్ర వివాదంగా మారింది.