ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా కుక్క తప్పిపోయింది, ఎక్కడుందో చెప్తే రూ.50 వేలు.. ఓ జంట బంపరాఫర్

national |  Suryaa Desk  | Published : Mon, Nov 11, 2024, 10:16 PM

పెంపుడు జంతువులు అంటే చాలా మంది ప్రాణంగా పెంచుకుంటారు. ఇక వాటిని కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి పెంపుడు జంతువులు.. తప్పిపోయినా, చనిపోయినా.. వాటిని పెంచుకునేవారు ఎంత తల్లడిల్లిపోతారో మనం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా ఓ జంట టూర్‌కు వెళ్లగా తమతోపాటే పెంపుడు శునకాలను కూడా తీసుకెళ్లారు. అయితే అక్కడే అందులో ఒకటి కనిపించకుండా పోయింది. దీంతో ఆ పెంపుడు శునకం ఎక్కడికి వెళ్లిందోనని తీవ్ర ఆందోళన చెందారు. దాన్ని కనిపెట్టేందుకు కొందరు వ్యక్తులను కూడా రంగంలోకి దించారు. అయినా దాని ఆచూకీ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తప్పిపోయిన తమ కుక్క గురించి ఎలాంటి సమాచారం తెలిపినా నగదు బహుమతి ఇస్తామని పేర్కొన్నారు.


ఢిల్లీకి చెందిన దీపయాన్ ఘోష్, కస్తూరి పాత్రా అనే దంపతులు.. ఇటీవలె ఆగ్రా టూర్‌కు వెళ్లారు. తమతోపాటే 2 పెంపుడు శునకాలను కూడా వారి వెంటే తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆగ్రాలోని ఓ ఫేమస్ హోటల్‌లో రూమ్ తీసుకుని అక్కడే బస చేశారు. ఈ క్రమంలోనే ఈనెల 1వ తేదీన వారు ఆగ్రా నుంచి ఫతేపూర్ సిక్రీకి వెళ్లారు. అయితే తమ వెంట ఆ పెంపుడు శునకాలను తీసుకెళ్లకుండా.. రెండు రోజుల పాటు వాటిని చూసుకోవాలని ఆ హోటల్ సిబ్బందిని చూసుకోవాలని చెప్పారు. అందుకోసం రూ.2వేలు కూడా ఇచ్చారు.


దీపయాన్, కస్తూరి తిరిగి.. రెండు రోజుల తర్వాత ఈనెల 3వ తేదీన ఆగ్రా హోటల్‌కు తిరిగివచ్చారు. అయితే వారికి చెందిన 2 శునకాల్లో ఒక్కటే కనిపించింది. అయితే మరో కుక్క తప్పిపోయినట్లు ఆ హోటల్ సిబ్బంది చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్పారు. దీంతో ఆ తప్పిపోయిన శునకం ఆచూకీని గుర్తించేందుకు ఏకంగా 30 మందికిపైగా వ్యక్తులను రంగంలోకి దింపారు. ఆగ్రాలో ఉన్న ఆ హోటల్ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో వాళ్లంతా ఆ శునకం కోసం జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను సేకరించి మరీ క్షుణ్ణంగా పరిశీలించారు. దీనిపై స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.


అయితే ఆ శునకం షాజహాన్ గార్డెన్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించామని ఆగ్రా ఏసీపీ సయ్యద్ ఆరిబ్ అహ్మద్ పేర్కొన్నారు. అయితే అక్కడి నుంచి అది ఎక్కడికి వెళ్లింది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదని చెప్పారు. కానీ ఆ కుక్క ఆచూకీ తెలియకపోవడంతో దీపయాన్, కస్తూరి దంపతులు తీవ్రంగా కుమిలిపోయారు. దీంతో వారిద్దరూ చర్చించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ కుక్క ఆచూకీని చెప్పినవారికి రూ.50 వేల నగదు ఇస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్లకార్డులపై రాసి చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతేకాకుండా ఈ కుక్కను గుర్తించేందుకు దానితో వారు దిగిన ఫొటోలను వారు షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com