దేశంలో ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతూ.. కాంగ్రెస్ పార్టీ ఉనికి కనుమరుగు అవుతుందన్న వేళ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన ఉచిత పథకాల హామీలే అధికారాన్ని దక్కించాయి. ప్రస్తుతం దేశంలో సొంతంగా అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ గ్యారెంటీలు అంటూ ఇచ్చిన హామీలు, పథకాలే ఈ 3 రాష్ట్రాల్లో హస్తం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి. అయితే ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు.. ఆయా రాష్ట్రాల్లో తీవ్ర భారంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు పరిచేందుకు ఖజానాపై భారీగా భారం పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఉచిత పథకాల అమలు, కాంగ్రెస్ గ్యారెంటీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 5 గ్యారంటీలు ఖజానాకు భారం అవుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంగీకరించారు. అయితే ఈ 5 గ్యారెంటీలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు కర్ణాటకలో ఈ పథకాల అమలు కొనసాగుతూనే ఉంటాయని తేల్చి చెప్పారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1.20 లక్షల కోట్లు కేటాయించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. అందులో గ్యారంటీలకు అమలుకు.. రూ.56 వేల కోట్లు.. అభివృద్ధి పనుల కోసం మరో రూ.60 వేల కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ఖజానాపై భారం పడటం సాధారణమేనని పేర్కొన్నారు. కానీ కర్ణాటకలో అభివృద్ధి పథకాల అమలుును మాత్రం నిలిపివేయలేదని స్పష్టం చేశారు. అన్ని ఖర్చులను అధిగమిస్తూ తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.
ఇక ఇటీవలె కర్ణాటకలో అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంపై సమీక్షించనున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు మహిళలు.. తాము డబ్బులు పెట్టి బస్సుల్లో ప్రయాణాలు చేస్తామని అంటున్నారని.. దాన్ని తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా.. స్వయంగా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఇక ఉచిత పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇటీవలె కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ను మించి గ్యారెంటీలు ఇవ్వొద్దని.. తీర్చలేని హామీలు ఇస్తే దివాలా తీసే పరిస్థితి వస్తుందని ఖర్గే ఇటీవలె వ్యాఖ్యలు చేయగా.. తాజాగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారెంటీలు, ఎన్నికల హామీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి బీజేపీ కార్యకర్తల వరకు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఆ హామీలను అమలు చేస్తే కర్ణాటక దివాలా తీస్తుందని పేర్కొన్నారు. అయితే మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన సిద్ధరామయ్య.. తమ ప్రభుత్వం కర్ణాటకలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి అవుతోందని.. అయితే ఇచ్చిన అన్ని గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో మల్లికార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని చెప్పారని.. అయితే ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు.