నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురం సమీపంలోని ఆకాశంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ కెమెరాను ఎగరవేశారు. ఆలయానికి సమీపంలో ఆకాశంలో డ్రోన్ ఎగురుతుండగా సెక్యూరిటీ సిబ్బంది గమనించి అప్రమత్తం అయ్యారు. వెంటనే డ్రోన్ ఎగురుతున్న ప్రాంతానికి వెళ్లారు.. అక్కడ కొంతమంది కనిపించారు. ఆలయ అధికారుల అనుమతి లేకుండా డ్రోన్ ఎలా ఎగరవేస్తున్నారని వారిని ప్రశ్నించారు. శ్రీశైలం ఆలయ పరిధిలో డ్రోన్ కెమెరాలు నిషేధించారని గుర్తు చేశారు.
వెంటనే డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు వ్యక్తులను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.. ఆ ఇద్దర్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. గతంలో కూడా శ్రీశైలం సమీపంలో డ్రోన్‌లు ఎగురవేసిన ఘటనలు జరిగాయి. రాత్రి వేళల్లో వరుసగా డ్రోన్‌లు ఎగురవేశారు.. అయితే వారిని గుర్తించేలోపు పారిపోయారు. మళ్లీ ఇప్పుడు డ్రోన్ కలకలంరేపింది.. వీరు శ్రీశైలం వచ్చిన భక్తులని తెలుస్తోంది. ఆలయం సమీపంలో ఇలా డ్రోన్ ఎగురవేయడం కలకలం రేపింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్న అఘోరి నాగసాధు శ్రీశైలంలో ప్రత్యక్షం అయ్యారు. ఆమె శ్రీశైలం వచ్చారని తెలియడంతో డీఎస్పీ, సీఐ, సీఎస్వోలు ముఖద్వారం దగ్గరకు వెళ్లారు. శ్రీశైలంల మల్లన్న ఆలయ నిబంధనల ప్రకారం సంప్రదాయ దుస్తులు ధరించి ఉభయ దేవాలయాల్లో దర్శనాలు చేసుకోవాలని సూచించగా అంగీకరించారు. మహిళా పోలీసులు, ఆలయ సిబ్బంది అఘోరికి దగ్గరుండి స్వామివారి దర్శనం కల్పించారు. ఆలయంలో అఘోరిని భక్తులు ఆసక్తిగా చూడగా.. కొందరు ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నించారు.
ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమైన మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యమని అన్నారు అఘోరి. గోవులను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని.. చిన్నారులు, బాలికలు, మహిళలు, చివరకు వృద్ధులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పటి వరకు తన పోరాటం ఆగదని.. తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్న తనను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తనను ఆలయాలను సందర్శించేందుకు సహకారం అందించాలని కోరారు. శ్రీశైలం నుంచి కోటప్పకొండ, విజయవాడ ఆలయాలు దర్శించుకుని కుంభమేళాకు వెళ్తున్నట్లు చెప్పారు.