జగన్ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఉచ్ఛనీచాలు మరచి ఆడవాళ్లను కూడా తిట్టించారని ధ్వజమెత్తారు.బాధితుల పైనే కేసులు పెట్టించి పోలీసు వ్యవస్థను నాశనం చేశారని ఫైర్ అయ్యారు. బందరులో ఒక వెధవ, సన్నాసి ఉన్నారని విమర్శించారు. నోటికొచ్చిన విధంగా వాగారు, తమపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయించారని మండిపడ్డారు. ఇప్పుడు ఇంకా సిగ్గు లేకుండా వాగుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు.సోషల్ మీడియాలో పోస్ట్‌లు నీచంగా పెట్టినప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అరెస్టులతో ఒక్కొక్కరూ ఫ్యాంట్‌లు తడుపుకుంటున్నారని విమర్శలు చేశారు. శ్రీరెడ్టి లాంటివాళ్లు ఇప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనమని అన్నారు. ఆనాడు కన్ను మిన్ను తెలియకుండా పిచ్చికూతలు కూశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులను అరెస్టు చేయాలని అన్నారు. మరోసారి నీచమైన భాష వాడకుండా కఠినంగా శిక్షించాలని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
చిలకలపూడి పాండురంగ స్వామికి ఇవాళ(మంగళవారం) పట్టు వస్త్రాలను మంత్రి కొల్లు రవీంద్ర - నీలిమ దంపతులు సమర్పించారు. మంత్రి వెంట ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జనసేన నేత బండి రామకృష్ణ తదితరులు ఉన్నారు. కార్తీక శుద్ధ ఏకాదశి పాండురంగ స్వామి ఉత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి కొల్లు రవీంద్రకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు పొందారు.
రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం..
''పాండురంగడి ఉత్సవాలు, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పండరీపుర క్షేత్రం తర్వాత చిలకలపూడి పాండురంగ స్వామి క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. స్వయంభువుగా వెలసిన స్వామి వారిని దర్శించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న స్వామివారి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నాం..15న కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్‌కు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పాండురంగ స్వామి ఉత్సవాలు, సముద్ర స్నానాల్లో పాల్గొని జయప్రదం చేయాలి'' అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.