సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లి అందజేశారు. ఆర్జీవీ ఎక్స్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో కేసు నమోదు చేయగా.. విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో.. వర్మ చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు.. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్‌లో పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులకు టీడీపీ నేత ఎం రామలింగం ఫిర్యాదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. మద్దిపాడు మాత్రమే కాదు.. గుంటూరు జిల్లా తుళ్లూరులోనూ ఆర్జీవీపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్ ఫొటోలను రామ్‌గోపాల్ వర్మ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు చేశారు. వర్మపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరగా.. తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కూడా కేసు నమోదైంది. ఆయనపై విజయవాడ భవానీపురం పోలీసులకు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. 2021 సెప్టెంబరు 28న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో, 2024 ఏప్రిల్ 22న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌పై పోసాని తీవ్రంగా విమర్శలు చేశారని జనసేన నేతలు పేర్కొన్నారు. ఆ వీడియోలను వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఎక్కువగా వినియోగిస్తూ పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠను దెబ్బ తీస్తోందని ఆరోపించారు. పోసాని కృష్ణమురళి, వైఎస్సార్‌సీపీ నేతపై చర్యలు తీసుకోవాలని కోరగ.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు శ్రీరెడ్డిపై అనకాపల్లి, రాజమహేంద్రవరంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్, వంగలపూడి అనితపై దుర్భాషలాడుతున్నారని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళా నేతలు అనకాపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. రాజమహేంద్రవరంలో కూడా శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు.