బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, కాకినాడ జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా అధికారులు, స్వచ్చంధ సంస్థలు కృషి చేయాలని ఐసీడీఎస్ జిల్లా పీడీ కె.ప్రవీణ కోరారు. మంగళవారం రమణయ్యపేట మండల పరిషత్తు కార్యాలయంలో చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిరోధంపై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బాల వివాహాల సమస్య పరిష్కారం, మైనర్ల సంక్షేమాన్ని ప్రోత్సాహించేందుకు వీలుగా ప్రభుత్వం 2006లో బాల్య వివాహాల నిషేద చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు.
జిల్లాలో ఇంకా 26 శాతం మేర అక్కడక్కడే బాల్య వివాహాలు జరుగుతున్నాయన్నారు. మైనర్ అంటే మెజారిటీ చట్టం 1875 ప్రకారం దేశంలో నివసించే ప్రతీ వ్యక్తి పద్దెనిమిది ఏళ్లు వయస్సు పూర్తి కాగానే మేజర్ అవుతాడన్నారు. 18 ఏళ్లు నిండిన స్త్రీ, 21 ఏళ్లు నిండిన పురుషుడు వివాహానికి అర్హుడన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినా, ప్రోత్సహించినా రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనపై క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. ఎంపీడీవో పసుపులేటి సతీష్, ఐసీడీఎస్ సీడీపీవో వై.లక్ష్మి, డీసీపీవో వెంకట్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.