ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలపై శ్రీరెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పార్టీకి, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే లక్ష్యంగా శ్రీరెడ్డి విషం చిమ్మారంటూ పద్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీరెడ్డిపై 196, 353(2), 79 BNS, 67 ITA-2000-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని మజ్జి పద్మ ఆరోపించారు. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని టీడీపీ మహిళా నేత పద్మ డిమాండ్ చేశారు. ఈ ఏడాది జులై 20న కూడా సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనితలపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ బీసీ సెల్ నాయకుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాతా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పలు సందర్భాల్లో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఫిర్యాదులో నాగరాజు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు, క్లిప్పింగులతోపాటు పలు ఆధారాలను ఆయన పోలీసులకు సమర్పించారు. దీంతో శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.