ఆఫ్రికా దేశానికి చెందిన వన్యప్రాణులను ఒడిశా నుంచి కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. సోమవారం రాత్రి ఇచ్ఛాపురం చెక్‌పోస్టు వద్ద కాశీబుగ్గ అటవీశాఖ అధికారులు సోదాలు నిర్వహించగా కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు పాములు, తాబేళ్లు, అడవిపిల్లిని తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి మొత్తం 21 వివిధ వన్యప్రాణులను స్వాధీనం చేసుకుని విశాఖపట్నంలో జంతు ప్రదర్శనశాలకు తరలించారు. స్మగ్లర్లను ఇచ్ఛాపురం కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి అటవీఅధికారి ఏఎంకే నాయుడు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.
కర్ణాటకకు చెందిన సయ్యద్‌లియాఖత్‌ఉల్లా, ముజాయత్ అహ్మద్‌ఖాన్, విజయ్‌కుమార్ ముఠా సభ్యులుగా ఏర్పడి విదేశీ వన్యప్రాణులను (జంతువులు, పక్షులు) ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఆఫ్రికా దేశానికి చెందిన వివిధ రకాల కొండచిలువ పిల్లలు 17, వందేళ్ల వయసు ఉండే తాబేలు, పదేళ్ల వయసు ఉండే రెండు చిన్న తాబేలు, ఏడాది వయసు ఉండే అడవి పిల్లిని తీసుకొచ్చి ఒడిశాలో ఓ బ్రోకర్‌కు విక్రయించాలనుకున్నారు. అయితే బేరసారాల్లో తేడా రావడంతో వాటిని మళ్లీ ఖరీదైన ఏసీ కారులో పెట్టి.. ఒడిశా మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇచ్ఛాపురం చెక్‌పోస్టు వద్ద కాశీబుగ్గ అటవీశాఖ అధికారులు కారును తనిఖీ చేశారు. ఇనుపజాలీలో చిరుతపులి మాదిరిగా ఓ జంతువు కనిపించడంతో వారు ప్రశ్నించగా ఆఫ్రికా వన్యప్రాణుల అక్రమ రవాణా బండారం బయట పడింది. మొత్తం 21 జంతువుల విలువ రూ.20లక్షలకు పైగా ఉంటుందని అంచనా. అందులో రెండు అడుగుల పొడవు గల కొండ చిలువే బహిరంగ మార్కెట్‌లో రూ.లక్ష వరకూ పలుకుతుందని అధికారులు చెబుతున్నారు. పట్టుబడిన జంతువులన్నీ ఇంటిలో పెంచుకోదగినవేనని, జంతు ప్రేమికులు వీటిని అధిక ధరలకు కొనుగోలు చేస్తుంటారని తెలిపారు. ఆ ముగ్గురి ముఠాసభ్యులను మంగళవారం ఇచ్ఛాపురం కోర్టులో హాజరుపరిచారు. పట్టుబడిన వన్యప్రాణులను విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాలకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారి ఏఎంకే నాయుడు తెలిపారు.