మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక ఎన్నికల పోలింగ్ వేళ.. ఆ రాష్ట్రంలో తీవ్ర విషాదం జరిగింది. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు పోలింగ్ వద్ద వేచి ఉన్న ఓ అభ్యర్థి గుండెపోటుతో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. దీంతో అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలాసాహబ్ షిండేకు పోలింగ్ బూత్ వద్దే హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడే ప్రాణాలు వదిలేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బీడ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే గుండెపోటుతో మరణించారు. బీడ్ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్రంగా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే.. బుధవారం ఛత్రపతి షాహూ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఎన్నికల తీరును పర్యవేక్షిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన పక్కనే ఉన్నవారు ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.
మొదట బాలాసాహెబ్ షిండేను స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తరలించగా.. పరిస్థితి తీవ్రం కావడంతో అక్కడి నుంచి ఛత్రపతి శంభాజీ నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయనను పరిశీలించిన డాక్టర్లు గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బాలాసాహెబ్ షిండే మృతితో బీడ్ నియోజకవర్గంలో విషాద చాయలు అలుముకున్నాయి.
బీడ్ నియోజకవర్గంలో బాలాసాహెబ్ షిండే ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఎన్నికల వేళ ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి అకస్మాత్తుగా మరణిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 52 ప్రకారం సంబంధిత నియోజకవర్గంలో ఓటింగ్‌ను వాయిదా వేసే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికల సంఘం అధికారులు మాత్రం.. బాలాసాహెబ్ షిండే మృతిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు.. సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 58.22శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.