మరో పదేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని, రాబోయే ఐదేళ్లలో ఏపీ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్ల(రూ.8.43 లక్షల కోట్లు)కు చేరుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇటీవల తాను మహారాష్ట్రకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్రం ఈ మైలురాయి చేరుతుందని చెప్పానని, అయితే, విధ్వంసానికి గురైన ఏపీలో అది సాధ్యంకాదేమోనని అనుకున్నానని చెప్పారు. కానీ.. సీఎం చంద్రబాబు విజన్, ఆయన పాలనానుభవం చూశాక ఐదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. 150 రోజుల పాలనపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘గంజాయి రవాణా, ఇసుక దోపిడీ, పంచాయతీల నిర్వీర్యం, దేవుడి విగ్రహాల కూల్చివేతలు లాంటివి మాత్రమే గత ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయి. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసింది. దేశంలో తెలుగువారు ముందుండడానికి కారణమైన చంద్రబాబు లాంటి వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టారు. సొంత ప్రచారానికి భూముల పాస్‌పుస్తకాలను కూడా వదలకుండా మాజీ సీఎం బొమ్మలు వేసుకున్నారు. కానీ, అందుకు విరుద్ధంగా నేను డాక్టర్ ‘యల్లాప్రగడ సుబ్బారావు’ పేరును ప్రస్తావించగానే సీఎం చంద్రబాబు ఓ కాలేజీకి ఆయన పేరు పెట్టారు. డొక్కా సీతమ్మ పేరును ప్రస్తావించగానే.. చిన్నారుల మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టారు. పథకాలకు స్వాతంత్ర సమరయోధులు, త్యాగాలు చేసినవారి పేర్లు పెట్టాలి. కానీ, గత ప్రభుత్వంలో జగన్ ప్రచార యావతో తన పేర్లు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు బలిదానం చేసిన రోజును రాష్ట్ర ఉత్సవంగా జరుపుకోబోతున్నాం. కన్యకాపరమేశ్వరి బలిదానం చేసిన రోజును కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు.